వైసీపీలో ముందస్తు ఎన్నిక‌ల గుబులు

`2019లో కాదు 2018 చివ‌ర్లోనే ఎన్నిక‌లు.. అంతా స‌న్న‌ద్ధంగా ఉండాలి` అంటూ శ్రేణుల‌కు టీడీపీ అధినేత దిశానిర్దేశం!! `ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా జ‌న‌సేన సిద్ధం` అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టంచేస్తున్నారు. కానీ ప్ర‌తిప‌క్ష వైసీపీలో మాత్రం `ముంద‌స్తు ఎన్నిక‌లు` టెన్ష‌న్ పెడుతున్నాయి. ఈ నెల28న అధినేత జగన్ బెయిల్‌ రద్దుపై నిర్ణ‌యంపైనా శ్రేణుల్లో క‌ల‌వరం మొద‌లైంది. ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లే నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గాల్లో లేక‌పోవ‌డం,  క‌ల‌హాలు .. ఇలా పార్టీలో ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా ఉంది. ఇటువంటి స‌మ‌యంలో.. ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగితే బొక్క‌బోర్లా ప‌డ‌టం ఖాయ‌మ‌ని నాయ‌కులు కంగారుప‌డుతున్నార‌ట‌. రాజ‌ధాని ప్రాంతంలో ప‌రిస్థితి మ‌రీ ఘోరంగా ఉంద‌ట‌.

మెజార్టీ నియోజకవర్గాల్లో ఇంకా నాయకులే కుదురుకోలేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో నాయకత్వ కొరత ఉందని వైసీపీ నాయ‌కులు విశ్లేషిస్తున్నారు. గుంటూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని దాదాపు పది నియోజకవర్గాల్లో నాయకత్వ కొరత స్పష్టంగా కనిపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వినుకొండ, చిలకలూరిపేట, పెదకూరపాడు, తెనాలి, గుంటూరు పశ్చిమ, తాడికొండ, సత్తెనపల్లి, పొన్నూరు, వేమూరు,రేపల్లె,  తదితర నియోజకవర్గాల్లో పార్టీకి నాయకత్వ కొరత ఉంది. వినుకొండ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం ఇక్కడ పార్టీ ఇన్‌ఛార్జిగా బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహరిస్తున్నారు.క్రియాశీలకంగా పనిచేయలేకపోతున్నారు.

మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘చిలకలూరిపేట’ నియోజకవర్గంలో ఆయనకు పోటీ ఇచ్చే వారు కనిపించడం లేదు. పెదకూరపాడులో కావటి మనోహర్‌ను ఇన్‌ఛార్జిగా పనిచేయిస్తున్నాఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి లేదు. తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై పోటీ చేయడానికి సరైన అభ్యర్థి లేరు. గుంటూరు పశ్చిమలో లేళ్ల అప్పిరెడ్డి రాజకీయంగా క్రియాశీలకంగా ఉండడం లేదు. తాడికొండలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు వ్యవహారశైలి స్థానిక నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. పొన్నూరు నియోజకవర్గంలో దూళ్లిపాళ్ల నరేంద్ర పై విజయం సాధించడం ఆషామాషీ కాదు.  వేమూరులో ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు మంత్రి కావడంతో ఇక్కడ టిడిపి పరిస్థితి గతం కన్నా పుంజుకుంది.

ఇక రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోవడంతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల,మంగళగిరి, మాచర్ల నియోజకవర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి. బాపట్లలో ఎమ్మెల్యే కోనరఘుపతికి మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. మంగళగిరిలో కూడా పార్టీ పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పనితీరుపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నర్సరావుపేట, గుంటూరు-1 ఎమ్మెల్యేల పనితీరు కన్నా ఇక్కడ ఉన్న సామాజికవర్గాల ప్రభావంతో మరోసారి వైకాపా విజయం సాధించవచ్చు.