షాక్ ఇస్తున్న అమరావతి ఇటుకలు!

అమరావతి అని రాజధాని పేరును ప్రకటించిన దగ్గరినుండి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తో ఊడగొట్టేసింది.అమరావతి పేరులోనే రాజసం ఉట్టిపడుతోంది.అమరావతి అంటే ప్రజలది..ప్రజలంటేనే అమరావతే అన్నంతగా ప్రచారాన్ని హోరెత్తించారు.అసలు శంకుస్థాపనయితే ఓ చారిత్రాత్మక ఘట్టంలా నిర్వహించారు.దాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ ఓ వైపు లోటు బడ్జెట్ సన్నాయి నొక్కులు నొక్కుతూనే మరో వైపు శంకుస్థాపన ఆర్భాటాలు చూసి జనం విస్తుపోయారు.

మొదట్లో స్వచ్ఛందంగానే ప్రజలంతా మన అమరావతి అనే నినాదం తోనే ముందుకెళ్లారు.అప్పట్లో ఆహా అమరావతి అన్న జనం ఇప్పుడు అమ్మో అమరావతి అంటున్నారు.దీనికి అనేక కారణాలు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నా అమరావతి-నా ఇటుక కార్యక్రమం దీనికి బెస్ట్ సాంపిల్.రాజధాని అమరావతి నిర్మాణం లో ప్రజలంతా భాగస్వాములవ్వాలని గతేడాది అక్టోబర్‌ 15న చంద్రబాబు పిలుపునిచ్చారు.దాని కోసం నా అమరావతి నాఇటుక’ అనే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.ప్రతి పౌరుడు కనీసం ఒక ఇటుకనైనా కొని రాజధాని నిర్మాణానికి చేయూతనివ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రజలంతా స్వచ్ఛందంగా స్పందించారు.చంద్రబాబు పిలుపునందుకొని ఒక్కరోజులోనే 2 లక్షల 20 వేల ఇటుకలు అమ్ముడయ్యాయి.దేశం నలుమూలల నుంచి శంకుస్థాపన రోజు వరకూ మొత్తం 33 లక్షల 52 వేల ఇటుకలు కొని 50 వేలకు పైగా ప్రజలు రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారు.ఇంతవరకు బాగానే వున్న రానురానూ ఈ కార్యక్రమం మసక బారింది.మొదటి మూడు నెలలోనే జనవరి 15 వరకూ 53 లక్షలకు చేరుకున్న ఇటుకల సంఖ్య…. నేటికి 55 లక్షలకే పరిమితమైంది.ప్రారంభమైన మూడు నెలల్లో రెండు లక్షల మందికి పైగా కొనుగోళ్లు జరిపితే ఆ తరువాత ఆరు నెలల్లో కేవలం రెండు వేల ఐదు వందల మంది మాత్రమే ఇటుకల కొనగోళ్లు జరిపారు.

ఒక్క ఇటుకల కార్యక్రమమే కాదు అసలు ప్రజా అమరావతి అన్న సంకేతంతో మొదలైన రాజధాని నిర్మాణం పాలకుల అమరావతి అన్న సంకేతాన్నిస్తోంది.అందుకే రాజధానికి సంబంధించిన ఏ కార్యక్రమం లోను సామాన్యులు భాగస్వాములు కాలేక పోతున్నారు.ఎంత సేపు విదేశీ పర్యటనలు..విదేశీ మోజే తప్ప స్వదేశీ పరిజ్ఞానం పై బాబుకి ఆసక్తి లేదు.ఈ మద్యే రష్యా పర్యటన ముగించుకొచ్చిన బాబు గారూ ఇక్కడి వాళ్ళతో కలిసి పనిచేస్తే మరో మురికి నగరమే తయారవుతుంది అందుకే విదేశాల్ని చుట్టివస్తున్న అంటూ చెప్పడం దీనికి మరింత ఆజ్యం పోస్తోంది.

అదొక్కటే కాదు.రాజధాని అంటే కేవలం ఆ రెండు జిల్లాకే అన్నట్టు ఈ అమరావతి వ్యవహారం ఉండటం కూడా ప్రజల్ని దూరం చేస్తోంది.అటు ఉత్తరాంధ్ర,ఇట్లు రాయలసీమ ప్రజలు రాజధాని నిర్మాణం లో భాగస్వామ్యులు కాలేకపోతున్నారు.ప్రభుత్వానికి పారదర్శకత లేకపోవడం కూడా దీనికి ఓ ముఖ్య కారణం..ఒంటెద్దు పోకడలకు పోవడం.ఏదయినా నిర్ణయించేసాక బయటికి చెప్పడం..అసలు స్విస్ ఛాలెంజ్ అంటే ఏమిటి..దాని వల్ల లాభ నష్టాలేని..ఎంతమందికి తెలుసు ఈ విషయాలన్నీ..మంత్రి వారాగానికే ఈ స్విస్ ఛాలెంజ్ పైన సరైన అవగాహన లేదనే వాదన కూడా ఉంది.ఇక సామాన్యుడికి చెప్పే నాధుడెవరు.ఇలా ప్రజారాధానిగా మొదలైన అమరావతి పాలకుల రాజధానిగా తయారవవుతోంది అన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది.