షాక్ ఇస్తున్న సంపూ ఓవర్సీస్ క్రేజ్

హిట్టు-ఫట్టులతో పనిలేదు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బరిలో ఉన్నాడంటే అందరికీ ఆసక్తే. అతడి సినిమాలు ఎలా ఉన్నా ముందస్తుగా వచ్చే టీజర్లు, ట్రైలర్లను జనాలు తెగ చూస్తుంటారు. తొలి చిత్రం ‘హృదయ కాలేయం’ నుంచే టాలీవుడ్ లో సంచలనం రేపాడితడు. సరికొత్త అభినయం, ఆహార్యంతో మంచి మార్కులే కొట్టేశాడు. దీంతో బాక్సాఫీసు వద్ద ఆయన చిత్రాలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఈ కోవలో సంపూ నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’ మరింత సెన్సేషన్ రేపుతోంది. టైటిలే ఇంత ఫన్నీగా ఉంది.. ఇక సినిమాలోనూ ఎంతోకొంత విషయం ఉంటుందన్న భావనతో ఈ మూవీపై అంతా ఆసక్తి చూపిస్తున్నారు.

కొబ్బరిమట్ట సినిమాలో సంపూ మూడు పాత్రల్లో నటిస్తుండడంతో బిజినెస్ పరంగా క్రేజ్ వచ్చింది. ఇక, ఈ చిత్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని విదేశాల్లోనూ రిలీజ్ చేయడానికి పలువురు ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రూ.30 లక్షలకు ఈ ఓవర్సీస్ హక్కులను మిడ్ వెస్ట్ మూవీస్ పంపిణీ సంస్థ సొంతం చేసుకుంది. సంపూకి ఉన్న ప్రత్యేక ఫాలోయింగ్ విదేశాల్లో కొబ్బరిమట్ట క్లిక్ అయ్యేందుకు దోహదపడుతుందని మిడ్ వెస్ట్ మూవీస్ భావిస్తోంది.