సల్మాన్ పెళ్లికొడుకాయనే!!

సల్మాన్ ఖాన్..బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌కి కేంద్రం. ఈ కండల వీరుడికి సంబంధించిన ప్రతీ విషయమూ వార్తల్లో పతాకశీర్ధికలవుతుంది. ఆయన పెళ్లి కూడా చాలా కాలంగా న్యూస్‌లో నానుతోంది. రొమేనియాకు చెందిన గాళ్ ఫ్రెండ్‌ లులియా వంటుర్‌తో సల్మాన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ గతంలోనే వార్తలొచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ బాలీవుడ్ కోడై కూసింది. కొన్ని రోజులు ఈ వార్తలు సద్దుమణిగినా తాజాగా ఈ ఇష్యూ మళ్లీ హెడ్‌లైన్స్‌ అయింది.

‘సా రే గ మ పా’అనే టీవీ షోలో 50ఏళ్ల సల్మాన్ మ్యారేజ్‌పై తన మనసులోని మాట బయటపెట్టారు. “పెళ్లి చేసుకునేందుకు చచ్చిపోతున్నా” అంటూ వ్యాఖ్యానించారు. పెళ్లికి తానెప్పుడూ సిద్ధంగానే ఉన్నానని… అవతలి పార్టీ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఇలాంటి విషయాల్లో మగవాళ్లు చెప్పడానికేం ఉండదని అంతా ఆడవాళ్లే నిర్ణయిస్తారని కామెంట్ చేశారు. సల్మాన్ తాజా స్టేట్‌మెంట్‌తో లులియా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. పెళ్లికి సల్లూ భాయ్ సిద్ధంగానే ఉన్నా లులియానే లేట్ చేస్తోందేమో అని కొందరు విశ్లేషణలు కూడా మొదలెట్టేశారు.