సీఎంతో జగన్ ఫ్రెండ్ షిఫ్ సీక్రెట్ ఏంటి..!

ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్ర‌స్తుతం వేస్తోన్న ఎత్తులు, రాజకీయ వ్యూహాలు ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు. 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్న జ‌గ‌న్ ఏపీలో ఇత‌ర పార్టీల‌కు చెందిన మాజీల‌ను, రాజ‌కీయంగా బ‌ల‌మైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న రాజ‌కీయ వార‌సుల‌ను సైతం త‌న పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల త‌ర్వాత జాతీయ రాజ‌కీయాల్లో సైతం స‌త్తా చాటేందుకు జ‌గ‌న్ పావులు క‌దుప‌తున్న‌ట్టు తెలుస్తోంది.

జ‌గ‌న్‌కు జాతీయ స్థాయిలో బీజేపీ అండ‌దండ‌లు ఉండ‌వు. బీజేపీ-టీడీపీ పొత్తు ఉండడంతో బీజేపీ జ‌గ‌న్ క‌ల‌యిక అసాధ్యం. ఇక జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినందున ఆ పార్టీతో కూడా జ‌త‌క‌ట్ట‌డు. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల్లో కీల‌కంగా మారుతుంద‌ని అంద‌రూ అనుకుంటున్న థ‌ర్డ్ ఫ్రంట్ వైపు జ‌గ‌న్ చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ థ‌ర్డ్ ఫ్రంట్‌లో కీల‌క‌మ‌వుతుంద‌ని భావిస్తోన్న ఎస్పీతో స్నేహ‌సంబంధాలు మెరుగుప‌ర‌చుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. యూపీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌తో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది.

అఖిలేష్ ఇటీవ‌ల తండ్రిమీదే తిరుగుబాటు చేసి జాతీయ రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా వార్త‌ల్లోకొచ్చారు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి మధ్య దోస్తానా ఒక స్థాయిలో ఉందని.. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషించేందుకు వీరు ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని జాతీయ మీడియా వ‌ర్గాల క‌థ‌నం. ఇంకా చెప్పాలంటే 2019లో కాంగ్రెస్‌, బీజేపీల‌కు వ్య‌తిరేకంగా ఏర్ప‌డే థ‌ర్డ్ ఫ్రంట్‌లో ఎస్పీ-జేడీయూ-వైసీపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు కీలకం కానున్నాయి. మొత్తానికి జ‌గ‌న్ జాతీయ రాజ‌కీయాల్లో రాణించేందుకు అదిరిపోయే స్కెచ్ వేస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.