సీబీఐ కి అగ్రిగోల్డ్-బినామీల్లో వణుకు!

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు జరగబోతుంది. దర్యాప్తు సి.ఐ.డి. చేతిలోంచి సి.బి.ఐ.కి చేరనుంది. అయితే సిబిఐ దర్యాప్తుతో బాధితులకు న్యాయం జరుగుతుందా..? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నట్లు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా.? క్రిమినల్ కేసులను మాత్రమే సిబిఐకి ఇచ్చి భాదితులకు డబ్బులు చెల్లించేందుకు హైకోర్టు ముందుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతకీ సిబిఐ దర్యాప్తుతో ఎవరి పీఠాలు కదలనున్నాయి. ఈ స్కాంలో ఎంతమంది వీఐపీలు భయటపడనున్నారు.అగ్రిగోల్డ్ సంస్థ..20 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కోర్టును తప్పుదోవపట్టించిన బడా సంస్థ. అనుమతులు లేని ఆస్తులను జస్టిస్‌ సీతాపతి కమిటి ఇచ్చి..బడా ఆస్తులను తన వద్దే ఉంచుకుంది. అయితే 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ..అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మొత్తం 8 రాష్ట్రాల్లో 40 లక్షల మంది నుంచి 7 వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. 5 సంవత్సరాల తర్వాత మీకు తిరిగి ఇస్తామని నెల వారీగా కొద్ది మొత్తం రాబట్టుకున్నారు. తీరా డబ్బులు ఇచ్చే సమయానికి చేతులు ఎత్తేశారు. అయితే ఈ కంపెనీలో 20 మంది డైరెక్టర్స్ ఉన్నారు. వీరి సిస్టర్స్ సంస్థలు 9 వరకు ఉన్నాయి. బినామి రూపంలో డబ్బులను వేరే సంస్థలోకి మళ్లించారని అరోపణ. బాధితులు పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపట్టారు. అంతటితో ఆగకుండా హై కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఏ.పీ. ప్రభుత్వం సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది.
అయితే 40 లక్షల మంది ఖాతాదారులను మోసం చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వెంటనే స్పందించిన ఏపీసీఐడీ..అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ అవ్వ వెంకట రామారావు, హాయిలాండ్ ఎం.డీ. శ్రీరామచంద్రరావును, సదా శివ వరప్రసాద్, అవ్వా శేషు నారాయణను, అహ్మద్ ఖాన్‌లను సీఐడి అరెస్ట్ చేసింది. అయితే ఆస్తులన్నీ అమ్మితే 20వేల కోట్ల రూపాయాలు వస్తాయని..7 వేల కోట్లు చెల్లించేందుకు ఇబ్బందులు లేవని కోర్టుకు తెలిపారు. దీంతో ఆస్తులు అమ్మి బాధితులకు ఇచ్చేందుకు త్రిసభ్య కమిటిని నియమించింది హైకోర్టు. కానీ ఈ కమిటీ పనితీరులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం సీబీఐతో కేసు విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్స్ డిమాండ్ చేయడంతో.. ఏ.పీ ప్రభుత్వం అభ్యంతరాలుంటే చెప్పాలని ఆదేశించింది. అయితే సీబీఐ కేసు విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పడంతో సీబీఐ దర్యాప్తుపై ఆసక్తి నెలకొంది.

సీబీఐతో దర్యాప్తు చేస్తే అనేక లాభాలున్నాయని బాధితులు చెప్తున్నారు. ఖాతాదారుల నుంచి వచ్చిన మొత్తాన్ని ఏ ఏ అకౌంట్లకు బదిలీలయ్యాయో సీబీఐ దర్యాప్తులో తేలనుంది. అలాగే ఆడిట్ రిపోర్టులను కూడా క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా బినామి ఆస్తులపై కూడా ఆరా తీయనున్నారు. ఏపీ ప్రభుత్వం ఆస్తుల అటాచ్ మెంట్ కంటే ముందు కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారంపై కీలక దర్యాప్తు జరుగనుంది. మంత్రి పుల్లారావు అతని భార్య పేరు మీద కోనుగోలు చేసిన ఆస్తుల వివరాలు..విలువైన ఆస్తులను బదలాయించడంపై సి.బి.ఐ.రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. తిరుపతిలోని రాంఆవాస్ రిసార్ట్స్ అమ్మకం, బెంగళూర్ ఆస్తులు, హాయ్ ల్యాండ్ అమ్మకంలో ఇబ్బందులపై సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు చేయనుంది.

మరోవైపు అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఐడీకి బదులు సీబీఐతో దర్యాప్తు జరిగితే సెబీ అనుమతులు లేకుండా ఎలాంటి మోసాలకు పాల్పడ్డారో.. పక్కా ఆధారాలు లభిస్తాయని హైకోర్టు కూడా భావిస్తోంది. తద్వారా మోసానికి పాల్పడ్డ నిందితులకు కోర్టుల్లో శిక్షలు పడే అవకాశం కూడా ఉంటుందనేది కోర్టు భావన. దీంతో అతి త్వరలోనే అగ్రిగోల్డ్‌ కేసు సీబీఐకి అప్పగించే అవకాశం కన్పిస్తోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకోనుంది హైకోర్టు.