సూర్యకు అతి మంచితనమే మైనస్ అయ్యిందా..!

కోలీవుడ్ హీరో సూర్య-దర్శకుడు హరి కాంబినేషన్‌లో తెర‌కెక్కిన సింగం సిరీస్ సినిమాల‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సిరీస్‌లో తెర‌కెక్కిన మూడో సినిమా ఎస్ 3 (కొత్త పేరు సి 3) జ‌న‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సౌత్ ఇండియాలోనే భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సినిమాగా రికార్డుల‌కు ఎక్కిన ఈ సినిమా రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.

సీ 3లో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతీహాస‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దీంతో తెలుగులో సైతం సీ 3కు సూప‌ర్ క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేయాల‌నుకున్న సూర్య‌కు ఇప్పుడు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి. ముందుగా సీ 3ను డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌నుకున్నా అదే టైంలో రాంచ‌ర‌ణ్ ధృవ సినిమా వ‌స్తుండ‌డంతో అల్లు అర‌వింద్ ఒత్తిడి కార‌ణంగా సూర్య త‌న సినిమాను డిసెంబ‌ర్ చివ‌ర‌కు ..త‌ర్వాత తిరిగి జ‌న‌వ‌రి 26కు వాయిదా వేసుకున్నాడు.

అయితే ఇప్పుడు తెలుగులో థియేట‌ర్ల‌న్ని ఖైదీ – శాత‌క‌ర్ణి – శ‌త‌మానం భ‌వ‌తితో నిండిపోయాయి. జ‌న‌వ‌రి 26కు చాలా త‌క్కువ థియేట‌ర్లు మాత్ర‌మే ఖాళీ కానున్నాయి. అయితే అవి కూడా ఎన్ని రోజులు ఉంటాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఆ మ‌రుస‌టి వార‌మే నాని నేను లోక‌ల్ వ‌చ్చేస్తోంది. ఆ సినిమాను ఎక్కువ థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేస్తున్నారు. అంటే సూర్య సీ 3కు దొరికే త‌క్కువ థియేట‌ర్ల‌తోనే వారం రోజులు స‌రిపెట్టుకోవాల‌న్న‌మాట‌.

కేవ‌లం ధృవకు ఇబ్బంది లేకుండా అర‌వింద్ ఒత్తిళ్ల‌తో త‌న సినిమాను వాయిదా వేసుకోవ‌డం వ‌ల్లే ఇప్పుడు త‌న సినిమాకు స‌రైన రిలీజ్ టైం లేకుండా సూర్య చేసుకున్నాడ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోంది. ఏదేమైనా సీ 3కు సూర్య‌ అతి మంచిత‌న‌మే మైన‌స్ అయ్యేలా ఉంది