సొంత జిల్లాలో బాబుకు సీనియ‌ర్ల ఝ‌ల‌క్‌

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అనంత‌రం అన్ని జిల్లాల్లోని టీడీపీ వ‌ర్గాల్లో అసంతృప్తి జ్వాల‌లు ర‌గిలాయి. సీనియ‌ర్లు అల‌క‌బూన‌డం.. అనంత‌రం వారిని బుజ్జ‌గించ‌డం అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. కానీ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు జిల్లాలో మాత్రం ఇవి ఇంకా నివురుగ‌ప్పిన నిప్పులా కొన‌సాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన, బాబుకు అత్యంత స‌న్నిహితులైన‌ ఇద్ద‌రు సీనియ‌ర్లు ఇప్పుడు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. అంతేగాక చంద్ర‌బాబుకు, వారికీ మ‌ధ్య గ్యాప్ పెరుగుతూ వ‌స్తోంద‌నే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. సీఎం నిర్వ‌హించిన స‌మావేశానికి వీరు డుమ్మా కొట్టడం వీటికి మ‌రింత బ‌లం చేకూరుస్తోంది.

అనారోగ్య కార‌ణాల‌తో త‌న‌ను క్యాబినెట్ నుంచి త‌ప్పించార‌ని మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణ‌, మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌తో పాటు అన్నింటిలోనూ త‌మ వ‌ర్గానికి అన్యాయం జ‌రుగుతోంద‌ని ఎంపీ శివ‌ప్ర‌సాద్‌.. మ‌రొక‌రు సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. బొజ్జ‌ల దీనిని బాహాటంగా బ‌య‌ట‌పెట్ట‌క‌పోయినా లోలోపలే ఎంతో కుమిలిపోతున్నార‌ని ఆయ‌న వ‌ర్గీయులు చెబుతున్నారు. అనారోగ్యం పేరిట పార్టీ అధిష్టానం ఆయనను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురైన బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతం బుజ్జ‌గింపుల్లో ఆయ‌న త‌న రాజీనామాను వెన‌క్కి తీసుకున్నారు.

పార్టీలో ఈ వేడి చల్లారక ముందే సీనియర్‌ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ తెర మీదకు వచ్చారు. త‌న వ‌ర్గం వారికి అన్యాయం జ‌రుగుతోంద‌ని శివ‌ప్ర‌సాద్ నేరుగా సీఎంనే టార్గెట్ చేయ‌డం.. త‌ర్వాత ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సీఎం సిద్ధ‌మ‌వ‌డం తెలిసిందే! ఈ నేప‌థ్యంలోనే చంద్రబాబు చిత్తూరు జిల్లా నేత‌ల‌తో స‌మావేశం ఏర్పాటుచేశారు. దీనికి వారిద్ద‌రూ గైర్హాజ‌రు కావ‌డం మ‌రోసారి చర్చ‌నీయాంశ‌మైంది. కాగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ నేతలు చాలామంది ఏడాదిగా అసంతృప్తితోనే ఉన్నారు.

పార్టీ పరంగా సీనియర్లకు ఎదురవుతున్న వరుస అవమానాలపై పరస్పర చర్చ మొదలైంద‌ట‌. మ‌రి వీట‌న్నింటినీ చంద్ర‌బాబు వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించ‌క‌పోతే.. గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌డం ఖాయమ‌నే అనుమానాలు శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. వ‌రుస‌గా ఇలా సీనియ‌ర్లు ఇలా పార్టీకి దూరంగా ఉండ‌టం మంచిది కాద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.