స్విస్ ఛాలెంజ్ నుంచి బాబు బ‌య‌ట‌ప‌డే య‌త్నం

ఏపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం చంద్ర‌బాబును ఇర‌కాటంలోకి నెట్టిన స్విస్ ఛాలెంజ్ విష‌యంలో బ‌య‌ట‌ప‌డేందుకు బాబు ప్రయ‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం కోర్టులో దీనిపై కేసు న‌డుస్తుండ‌గానే ఈ టెండ‌ర్ విధానానికి సంబంధించిన నిబంధ‌న‌ల‌ను మార్చాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను మంగ‌ళ‌వారం జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో చ‌ర్చించి ఆమోదించాల‌ని చూస్తున్నారు. అయితే, ఒక ప‌క్క కోర్టులో కేసు న‌డుస్తుండ‌గానే.. దీనికి సంబంధించిన నిబంధ‌న‌ల‌ను మార్చ‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయ‌స‌మ్మ‌తం అనే ప్ర‌శ్న ఉత్పన్న‌మ‌వుతోంది. దీనికి కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ప్ర‌శ్నే. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు స్విస్ ఛాలెంజ్ విష‌యంలో దూకుడుగానే ఉన్నారు.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్రపంచ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దే క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు డే అండ్ నైట్ హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారన‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ‌ధానిలో ప్ర‌ధాన నిర్మాణాల‌కు సంబంధించి స్విస్ ఛాలెంజ్ విధానాన్ని న‌మ్ముకున్నారు. ఈ విధానంలోనే నిర్మాణాలు సాగాల‌ని ఆయ‌న భావించారు. దీని ప్ర‌కారం టెండ‌ర్ల‌ను ఆహ్వానించారు. అయితే, ఈ టెండ‌ర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం కొన్ని విష‌యాల‌ను ప్రభుత్వం వెల్ల‌డించ లేదు. అదేవిధంగా ప్ర‌పంచ స్థాయి సంస్థ‌లే బిడ్‌లో పాల్గొనాల‌ని నిబంధ‌న పెట్టారు. దీంతో ఈ విధానాన్ని వ్య‌తిరేకిస్తూ.. రెండు నిర్మాణ సంస్థ‌లు హైకోర్టును ఆశ్ర‌యించాయి. సింగిల్ జ‌డ్జి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీర్పు కూడా ఇచ్చేశారు. అయితే, ఈ తీర్పును ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్ వ‌ద్ద స‌వాలు చేసింది.

ప్ర‌స్తుతం స్విస్ ఛాలెంజ్ కేసు డివిజ‌న్ బెంచ్ విచార‌ణ‌లో సాగుతోంది. ఇంకా తుది తీర్పు రావాల్సి ఉంది. అయితే, ఎట్టి ప‌రిస్థితిలోనూ రాజ‌ధాని నిర్మాణం స్విస్ ఛాలెంజ్ ప్ర‌కార‌మే జ‌ర‌గాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న చంద్ర‌బాబు.. ప్ర‌స్తుతం ఉత్ప‌న్న‌మైన న్యాయ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేలా, భ‌విష్య‌త్తులో దీనిని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కుండా ఉండేలా ఏ చట్టం ప్రకారం అయితే స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్లు పిలిచారో ఈ చట్టాన్నేస‌వ‌రించాల‌ని నిర్ణ‌యించారు.

చట్టసవరణకు సంబంధించిన అంశం మంగళవారం చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు సంబంధించి తుది నిర్ణ‌యం తీసుకుని అమ‌ల్లో పెట్ట‌నున్నారు. ఏదేమైనా స్విస్ ఛాలెంజ్ విష‌యంలో ఏర్ప‌డిన స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మంచాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి రానున్న రోజుల్లో ఈ ప‌రిణామం మ‌రిన్ని వివాదాల‌కు దారితీస్తుందో?  లేక ఇక్క‌డితో చంద్ర‌బాబుకు ఊర‌ట ల‌భిస్తుందో?  చూడాలి.