హోదా – తల్లిపాలు, ప్యాకేజీ – డబ్బా పాలు.

డబ్బా పాలు చంటి పిల్ల ఆరోగ్యానికి క్షేమం కాదు. కానీ విధిలేని పరిస్థితుల్లో వైద్యులు డబ్బా పాలను పసి పిల్లలకు ఆహారంగా సూచిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ అనే పసిపాపకి ఇప్పుడు డబ్బా పాల అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రత్యేక హోదా అనే తల్లిని కేంద్రమే దూరం చేసింది. దారుణం కదా ఇది. ఈ పోలిక తెచ్చింది బిజెపి మిత్రపక్షం అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ శివప్రసాద్‌. చిత్తూరు జిల్లాకు చెందిన శివప్రసాద్‌, రాజకీయ నిరసనల కోసం సరికొత్త అంశాల్ని ఎంచుకుంటుంటారు.

పార్లమెంటు సాక్షిగా లెక్కకు మిక్కిలిగా అనేక వేషధారణలు వేసి తన నిరసనల్ని తెలియజేశారు. సమైక్య తెలుగు రాష్ట్రం విడిపోతున్న సమయంలోనూ, ఇప్పుడూ ఆయన వేషధారణలతో నిరసనల్ని కేంద్రం దృష్టికి తీసుకెళుతూనే ఉన్నారు. అయినప్పటికీ అవేవీ కేంద్రాన్ని కదిలించలేకపోయాయి. యూపీఏ ప్రభుత్వం అంటే టిడిపికి పూర్తి వ్యతిరేకం, అందుకే వినలేదు. ఎన్డీయే ప్రభుత్వంలో టిడిపి భాగస్వామి కదా. అయినా ఆయన ఆవేదనను ప్రధానమంత్రి నరేంద్రమోడీ పట్టించుకోవడంలేదు.

డబ్బా పాలు తాగే పిల్లల్లో ఎలాగైతే ఎదుగుదల సరిగ్గా ఉండదో, ఆరోగ్యం సరిగా ఉండదో రేప్పొద్దున్న ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి కూడా అలాగే బక్కచిక్కిపోవచ్చు. కానీ, హోదా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కి వేరే గత్యంతరం లేదని కేంద్రం చెబుతోంది. హోదాకి మించిన ప్యాకేజీ అని కేంద్రం చెబుతున్నప్పటికీ తల్లిని మించి బిడ్డ బాధ్యతలు ఇంకెవరు సరిగ్గా చూసుకోగలరు?