హోదా పోరాటాన్ని తొక్కేస్తున్న‌ టీడీపీ, బీజేపీ

హోదా ఇచ్చే వ‌ర‌కూ పోరాడ‌దామ‌ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇప్పుడు హోదాతో ఒరిగేది ఏమీ లేదు ప్యాకేజీతోనే లాభ‌మ‌ని ఫిరాయించారు!! హోదా ఐదేళ్లు కాదు ప‌దేళ్లు ఇవ్వాలి అని పోరాడిన వెంక‌య్య‌.. ఇప్పుడు ప్యాకేజీనే మంచిదంటూ నీతులు వ‌ల్లెవేస్తున్నారు!! హోదా అని ప్యాకేజీ ఇచ్చారేంటి? అని ప్ర‌శ్నించేందుకు బాబు సిద్ధంగా లేరు! టీడీపీ ఎంపీలు, బీజేపీ నాయ‌కులు ఏపీ ప్ర‌జ‌ల‌కు పెట్టిన శ‌ఠ‌గోపం గురించి మాట్లాడేందుకు నోరు మెద‌ప‌డం లేదు! హోదా కోసం జరిగే పోరాటం పుంజుకుంటే తన వైఫల్యం క‌నిపిస్తుంద‌ని అందుకు ముందే ఆటంకాలు పెడుతోంది టీడీపీ!!

ప్రత్యేక హౌదా లేదా ప్యాకేజీ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రతిపాదనలపై పెద్దగా స్పందించేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు సుముఖంగా లేదు. పైకి ఎన్ని మాటలు మాట్లాడినా ఇచ్చేదేమీ ఉండబోదని కేంద్ర నాయకులు ఒకటికి రెండు సార్లు టీడీపీ నేతలకు చెబుతూనే ఉన్నారు. ఈ విషయం ప్రజల ముందు ఒప్పుకుంటే వైసీపీ, ఇతర ప్రతిపక్షాల దాడికి బలం చేకూరుతుంది. లేదని ప్యాకేజీ పాటే పాడుతూ కూచుంటే రేపు పరువు నష్టమవుతోంది. మ‌రోప‌క్క బీజేపీ త‌న‌తో చెల‌గాట‌మాడుతోంద‌ని తెలిసినా జ‌త క‌ట్ట‌క త‌ప్ప‌డంలేదు.

ఈ సమయంలోనే జనసేన అధ్య‌క్షుడు పవన్‌ కళ్యాణ్ మ‌రో స‌మ‌స్య‌గా మారాడు. ఇప్పటి వరకూ ఆయన కేంద్రాన్ని తప్ప తమను పెద్దగా అనడం లేదు కాబట్టి ప‌వ‌న్ తమ వాడేనన్న సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు టీడీపీ పెద్ద‌లు. కానీ ప‌వ‌న్ స్వ‌రం పెంచుతున్నా.. ఏమీ అనలేని ప‌రిస్థితి. ప‌వ‌న్‌పై దాడిచేస్తే కాపు సామాజిక‌వ‌ర్గంలో త‌మ‌పై వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావిస్తోంది. అందుకే ఈ విష‌యంలో ఎలాంటి వ్యూహం అమ‌లు చేయాలో తెలియక స‌త‌మ‌త‌మ‌వుతోంది.

ఇదే స‌మయంలో విశాఖ‌లో జ‌రిగే హోదా ఉద్య‌మానికి నాంది ప‌ల‌కాల‌న్న ఆశ‌ల‌కు ముందే గండి కొట్టాల‌ని బీజేపీ, టీడీపీ సిద్ధ‌మ‌వుతున్నాయి, ఉద్యమాలను అనుమతించేందుకు స‌సేమిరా అని నిర్ణ‌యించుకుంది. అయితే ఈ విధానం ప్రజల్లో ఆగ్రహం పెంచుతున‌డంలో సందేహం లేదు. ఈ చ‌ర్య‌ల‌న్నీ అటు టీడీపీ, బీజేపీపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌న‌డంలో సందేహం లేదు!