2019కు లోకేశ్ టీం రెడీ అవుతోంది..!

ఏపీలో 2109లో జ‌రిగే ఎన్నిక‌ల్లో లోకేశ్ ముద్ర స్ప‌ష్టంగా క‌న‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే మంత్రిగా ఉన్న లోకేశ్ టీడీపీకి ఫ్యూచ‌ర్ లీడ‌ర్ అన్న సంకేతాలు బాబు ఇచ్చేశారు. లోకేశ్‌ను త‌న వార‌సుడిగా రెడీ చేస్తోన్న చంద్ర‌బాబు లోకేశ్‌ను స‌డెన్‌గా ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేసిన చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఎప్పుడైనా టీడీపీ ప‌గ్గాలు లోకేశ్‌కు అప్ప‌గించ‌నున్నారు. ఈ లోగానే ఏపీలోని అన్ని జిల్లాల్లోను త‌న టీం ఉండేలా లోకేశ్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఏపీలో నియోజ‌క‌వ‌ర్గాల పెంపుతో ప్ర‌స్తుతం ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాలు 225 కానున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కేటాయింపులో లోకేశ్ మార్క్ స్ప‌ష్టంగా క‌న‌ప‌డ‌నుంది. ఈ విష‌యం ఇప్ప‌టికే టీడీపీ వ‌ర్గాలు కూడా గ్ర‌హించేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కోసం లోకేశ్‌ను ప్రాప‌కం చేసుకునే ప‌నిలో ప‌డ్డాయి.

ఈ క్ర‌మంలోనే లోకేశ్ త‌న‌కంటూ యూత్ లీడర్ల‌తో ఓ టీంను ఏర్ప‌రుచుకుంటున్నాడు. త‌న టీం కోసం కొత్త‌గా ఏర్ప‌డే నియోజ‌క‌వ‌ర్గాలు కేటాయించాల‌ని కూడా లోకేశ్ భావిస్తున్నాడు. లోకేశ్‌ జాబితాలో మంత్రి అయ్యన్న పాత్రుడు తనయుడు విజ‌య్‌, మాజీ కేంద్రమంత్రి బోళ్ల బుల్లిరామయ్య మనవడు బోళ్ల రాజీవ్, ఎంపీ మాగంటి బాబు కుమారుడు రామ్ జీ, అల్లూరి విక్రమాదిత్య, పరిటాల శ్రీరామ్ తదితులు ప్రథ‌మ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

వీరితో పాటు చంద్ర‌బాబుతో ఉప్పునిప్పుగా ఉంటోన్న ఎమ్మెల్సీ కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు పేర్లు కూడా విన్పిస్తున్నాయి. ఇక ఇప్ప‌టికే శ్రీకాకుళం యంగ్ ఎంపీ కింజార‌పు రామ్మోహ‌న్‌నాయుడు లోకేశ్ టీంలో కీల‌క మెంబ‌ర్ కానున్నారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి రామ్మోహ‌న్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్ల ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగాను పోటీ చేయిస్తార‌ని తెలుస్తోంది.

ఏదేమైనా లోకేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కేటాయింపులో కీ రోల్ ప్లే చేయ‌డం ఖాయం. ఇక దీనికి త‌గ్గ‌ట్టే త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ప్లాన్ చేసుకునే క్ర‌మంలో టీడీపీలో యంగ్ లీడ‌ర్ల‌తో త‌న‌కంటూ స‌ప‌రేట్‌గా ఓ టీం కూడా ఏర్ప‌రిచేసుకుంటున్నాడు.