2019 వార్ టీడీపీకి పూల‌పాన్పు కాదు

న‌వ్యాంధ్రప్రదేశ్‌కు తొలి సీఎం అయ్యేందుకు చంద్ర‌బాబు ఎన్నో క‌ష్ట‌నష్టాలు ప‌డ్డారు. వ‌రుస‌గా రెండుసార్లు ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైన ఆయ‌న ఈ ప‌దేళ్ల కాలంలో ఎంతోమంది సీనియ‌ర్ల‌ను వ‌దులుకున్నారు. కొంద‌రు పార్టీలు మారిపోతే, మ‌రి కొంద‌రు రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించ‌డం లేదా మ‌ర‌ణించ‌డం జ‌రిగాయి. 2004లో టీడీపీ చ‌రిత్ర‌లోనే ఘోర ప‌రాజ‌యం చూసింది. 2009లోను ముక్కోణ‌పు పోటీలో మ‌రోసారి వ‌రుస‌గా ఓడింది.

ఇక 2004కు ముందు వ‌ర‌కు చంద్ర‌బాబు పాల‌న అంటే ఓ క్రెడిబులిటీ ఉండేది. ఉద్యోగులు లంచం తీసుకునేందుకు భ‌య‌ప‌డేవారు. ఆయ‌న‌కు ప‌ని రాక్ష‌సుడు అన్న పేరుండేది. అందుకే 2014 ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు వ‌ర‌కు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న వేవ్ రాష్ట్ర విభ‌జ‌న‌తో ఒక్క‌సారిగా చంద్ర‌బాబు వైపు మ‌ళ్లింది. కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే స‌త్తా చంద్ర‌బాబుకే ఉంద‌ని న‌మ్మిన జ‌నాలు బాబును గెలిపించి న‌వ్యాంధ్ర‌కు తొలి సీఎం చేశారు.

అయితే బాబు సీఎం అయిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌కు వ‌రుస క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ఈ మూడేళ్ల బాబు పాల‌న స‌మీక్షించుకుంటే కేంద్రం నుంచి ఆశించినంత స‌హాయం అంద‌డం లేదు. రాజ‌ధాని ఎక్క‌డి వేసిన గొంగ‌లి అక్క‌డే ఉంది. ఇక నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లేదు. పోల‌వ‌రం ఇంకా సా….గుతూనే ఉంది. రుణ‌మాఫీ స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేదు. అవినీతి బాగా ఎక్కువైంది.

ఇక ఇప్పుడు 2014లో క‌సిగా ప‌నిచేసిన కార్య‌క‌ర్త‌ల్లో నిర్వేదం అలుముకుంది. లోక‌ల్ లీడ‌ర్ల నుంచి క‌నీస ప‌ల‌క‌రింపులు ఉండ‌డం లేదు. పార్టీ కోసం ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిపక్షంలో ఉండి ప‌నిచేసిన నాయ‌కుల‌కు చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. చంద్ర‌బాబు వీరిని కాద‌ని ఇత‌ర పార్టీల నుంచి గెలిచి వ‌చ్చిన వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు. ఇక చంద్ర‌బాబు గ‌త పాల‌న‌కు ఇప్పుట‌కీ కంపేరిజ‌న్ చేస్తే ఇప్ప‌టి మంత్రుల్లో చాలా మంది శాఖ‌ల మీద ప‌ట్టులేకుండా ఉన్నారు.

చంద్ర‌బాబు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా, ఆయ‌న‌కు స‌హ‌క‌రించే స‌మ‌ర్థులు అయిన నాయ‌కులు లేకుండా పోయారు. కొత్త‌గా రాజ‌కీయాల్లోకి ఆక‌ర్షితుల‌య్యే యువ‌త‌, ఫ‌స్ట్ టైం ఓటు హ‌క్కును ఉప‌యోగించుకునే వారు చంద్ర‌బాబు కంటే జ‌గ‌న్‌, ప‌వ‌న్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబుకు కూడా పార్టీ మీద కాన్‌సంట్రేష‌న్ కంటే అభివృద్ధి, నిధుల మీద కాన్‌సంట్రేష‌న్ పెర‌గ‌డంతో ఇక్క‌డ పార్టీని బ‌లోపేతం చేసే విష‌యంలో ఆయ‌న వెన‌క‌ప‌డుతున్నారు. లోకేశ్‌ను మంత్రిని చేసినా ఆయ‌న వ‌ల్ల పార్టీకి, ప్ర‌భుత్వానికి ఒరిగిందేమి లేదు.

ఇలా ఎలా చూసుకున్నా 2019 ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం చంద్ర‌బాబుకు అంత వీజీకాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ రెండేళ్ల‌లో బాబు ముళ్ల‌బాట‌లో జ‌ర్నీ చేసి 2019 అగ్నిప‌రీక్ష‌లో విన్ అవ్వాల్సి ఉంటుంది. చంద్ర‌బాబు ఇప్ప‌ట‌కీ అయినా మేల్కొని కార్య‌క‌ర్త‌ల్లో అసంతృప్తిని త‌గ్గిస్తే త‌ప్పా మ‌రోసారి ఆయ‌న సీఎం కావ‌డం క‌ష్టం.