48 గంట‌లు..ఏపీ, తెలంగాణ పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు ఫీవ‌ర్‌

ఏపీ, తెలంగాణ రాజ‌కీయ నాయ‌కుల‌కు వ‌చ్చే 48 గంట‌ల పాటు ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు వ‌చ్చే 48 గంటల్లో ఏం జ‌రుగుతుందా ? అని న‌రాలు తెగే ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. మ‌రి వీరు అంత‌లా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే నియోజ‌వ‌ర్గాల పెంపు జ‌రుగుతుందా ? లేదా ? అన్న‌దే వీరికి ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

కొత్త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌మాణస్వీకారం అనంత‌రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు, కేసీఆర్‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశంపై వీరు అమిత్‌తో చ‌ర్చించ‌నున్నారు. వీరు అమిత్ షాను ఒప్పిస్తే నెక్ట్స్ పార్ల‌మెంటు స‌మావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదింప‌జేసుకుంటే చాలు డీ లిమిటేష‌న్ జ‌రిగిపోయిన‌ట్టే.

డీ లిమిటేష‌న్ జ‌రిగితే ఏపీలోని ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాలు 225కు, తెలంగాణ‌లోని 119 నియోజ‌క‌వ‌ర్గాలు 153కు పెరుగుతాయి. నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగితే ఏపీలో చంద్ర‌బాబుకు, తెలంగాణ‌లో కేసీఆర్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపున‌కు దాదాపు 50 శాతం అవ‌కాశాలు ఇప్పుడే ఉన్న‌ట్టే. ఇక నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను చూపించి విప‌క్ష పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను పెద్ద ఎత్తున త‌మ పార్టీల్లో వీరిద్ద‌రు చేర్చుకున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగి సీట్లు పెర‌గ‌క‌పోతే టిక్కెట్ల కోసం ఏపీలో టీడీపీలో, తెలంగాణ‌లో టీఆర్ఎస్‌లోను బిగ్ ఫైట్ త‌ప్ప‌దు. అప్పుడు అది చంద్ర‌బాబు, కేసీఆర్ ఇద్ద‌రికి పెద్ద త‌ల‌నొప్పే. ఇక అమిత్ షాతో భేటీకి ఏపీ నుంచి సీఎం చంద్ర‌బాబుతో పాటు కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం.ర‌మేశ్ హాజ‌ర‌వుతుంటే తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్‌తో పాటు ఎంపీలు వినోద్‌కుమార్‌, జితేంద‌ర్‌రెడ్డి హాజ‌రు కానున్నారు.

ఈ భేటీలో వీరు అమిత్ షాపై ప్రెజ‌ర్ తెచ్చి పున‌ర్విభ‌జ‌న బిల్లు పార్ల‌మెంటులో ఆమెదింప‌జేసుకునేలా ఒప్పించుకోగ‌ల‌గితే స‌క్సెస్ అయినట్టే. లేని ప‌క్షంలో ఇక పున‌ర్విభ‌జ‌న అంశాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జాప్ర‌తినిధులు మ‌ర్చిపోవ‌ల్సిందే. దీంతో ఈ 48 గంట‌ల పాటు అటు చంద్రబాబు, కేసీఆర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నాయ‌కుల‌కు ఏం జ‌రుగుతుంది ? అన్న‌ది పెద్ద టెన్ష‌న్‌గానే ఉంది.