ఆ అంశాల్లో వాస్తు మ‌రిచిపోయారా బాబు

`అమరావ‌తికి వాస్తు బాగుంది. ఏ ప‌ని చేప‌ట్టినా విజ‌యమే` ఇది ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ కార్యక్ర‌మానికి వెళ్లినా.. ప‌దేప‌దే ఈ విష‌యాన్నిఅట్ట‌హాసంగా చెబుతుంటారు. ప్రతి కార్య‌క్ర‌మానికి అమరావ‌తి అంశాన్ని లింక్ చేసి చెప్పేస్తుంటారు. త‌న అనుభ‌వాన్ని అంతా రంగ‌రించి అమరావ‌తికి ప్ర‌త్యేక‌మైన బ్రాండింగ్ చేప‌ట్టే ప‌నిలో ప‌డ్డారు. అయితే ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. మిగిలిన అంశాల్లో చంద్ర‌బాబు `అమ‌రావ‌తి` సెంటిమెంట్ మాత్రం వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌ని వినిపిస్తోంది.

`ఏపీకి అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేయ‌డం శుభ‌సూచ‌కం`.. తాత్కాలిక స‌చివాల‌యం ప్రారంభోత్సవం, పోల‌వరం మ‌ట్టి ఫంక్ష‌న్‌, భాగ‌స్వామ్య స‌దస్సు ఇలా ఏ కార్య‌క్ర‌మ‌మైనా చంద్ర‌బాబు ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. మ‌హిళా పార్ల‌మెంటేరియ‌న్ల ముగింపు స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న మరోసారి ఈ విషయాన్ని చెప్పారు. అమ‌రావ‌తి వాస్తు అద్భుతంగా కుదిరింద‌నీ, అందుకే చేప‌ట్టిన ప్ర‌తీ కార్య‌క్ర‌మం దిగ్విజ‌యంగా ముందుకు సాగుతోంద‌ని చెప్పారు. మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే విష‌యంలో తెలుగుదేశం ఏక‌గీవ్రంగా అంగీకారం తెలుపుతోంద‌ని ఆయ‌న అన్నారు. ఈ ఘ‌న‌త‌కు కూడా కార‌ణం అమ‌రావ‌తి వాస్తు అన్న‌ట్టుగా చెప్పుకొచ్చారు!

రాష్ట్రంలో ఏ భారీ కార్య‌క్ర‌మం జ‌రిగినా దాన్ని సెంటిమెంట్‌తో ముడిపెట్టేయ‌డం బాబుకు బాగా అల‌వాటు! అమ‌రావ‌తి వాస్తు ప్ర‌భావంతోనే రాష్ట్రంలో అన్నీ భారీగా జ‌రుగుతున్నాయ‌నుకుంటే.. రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా ఎందుకు రావ‌డం లేద‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌! అలాగే హోదాకి బ‌దులు ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త ఎందుకు ఆల‌స్య మ‌వుతోందోన‌ని విశ్లేష‌కుల సందేహం! ప్ర‌భుత్వం ఎంతో ఆర్భాటంగా రాజ‌ధాని నిర్మాణం చేప‌డుతోంది. కానీ ఆ క‌ట్ట‌డాల నిర్మాణం నిర్మాణం ఎప్ప‌టికి మొద‌ల‌య్యేనో ఎవ్వ‌రికీ తెలీదు. ఇంకా డిజైన్ల ద‌గ్గ‌రే ప‌ని ఆగిపోయింది. ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులొచ్చాయ‌ని చెప్తున్నారు.. స‌ద‌రు కంపెనీల ప్రారంభోత్స‌వాలు ఎప్పుడు జ‌రుగుతాయో తెలియ‌దు!!

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌వ‌న్నీ శంకుస్థాప‌నలు మాత్ర‌మే! రాజ‌ధాని శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం ఒక‌టికి రెండుసార్లు భారీ ఎత్తున నిర్వ‌హించారు! తాత్కాలిక స‌చివాల‌యం ప్రారంభోత్స‌వం అట్ట‌హాసంగా చేశారు. ఈ మ‌ధ్య‌నే వైజాగ్‌లో భారీ ఎత్తున భాగ‌స్వామ్య స‌ద‌స్సు నిర్వ‌హించారు. పోల‌వ‌రం ప్రాజెక్టులో మ‌ట్టి త‌వ్వినా ఫంక్ష‌నే, సిమెంట్ క‌లిపినా ఫంక్ష‌నే! మ‌రి ఇవ‌న్నీ వాస్తు ప్ర‌కారం జ‌రుగుతున్నాయ‌ని ఆర్బాటంగా చెబుతున్నారు చంద్ర‌బాబు! కేవ‌లం జ‌రుగుతున్నవాటికే వాస్తు ఆపాదించి… మిగతా అంశాల జోలికి పోవ‌డం ఎంత వ‌రకూ స‌మంజ‌సం!!