ఆ క్రెడిట్ కేసీఆర్‌కు ద‌క్కకుండా మోడీ ప్లాన్‌

తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, భాజ‌పా మ‌ధ్య క్రెడిట్ గేమ్ న‌డుస్తోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. తెలంగాణ‌లో బ‌ల‌పడేందుకు బీజేపీకి అవ‌కాశాలు ఉండ‌టంతో అందుకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని ఆ పార్టీ నేత‌లు వ‌దిలిపెట్ట‌డం లేదు! ప్ర‌స్తుతం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశంలోనూ బ‌యట‌కి క‌నిపించ‌ని క్రెడిట్ గేమ్ మొద‌లైంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఇప్పుడు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసంమాట్లాడేందుకు అఖిల‌ప‌క్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల‌ని భావించిన‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్ర‌ధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చి.. ర‌ద్దు చేయ‌డంపై బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవడానికి కేసీఆర్‌కు క్రెడిట్ ద‌క్క‌కుండా చేయ‌డానికేన‌ని తెలుస్తోంది!

తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎద‌గాల‌న్న‌ది భాజ‌పా ల‌క్ష్యం. ముఖ్యంగా తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌ధాన పార్టీగా అవ‌త‌రించే అవ‌కాశాలున్నాయి. అయితే, ఈ క్ర‌మంలో కేంద్ర కేటాయింపుల‌పై స్థానిక భాజ‌పా క్రెడిట్ ద‌క్కించు కోలేక‌పోతోంది! కేంద్రం ఏమిచ్చినా, అది కేసీఆర్ సాధించిన ఘ‌న‌త‌గా తెరాస ప్ర‌చారం చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాలు రాజ‌కీయంగా భాజ‌పాకు మైలేజ్ ఇవ్వ‌డం లేదు. ఇక మాదిగ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది.

టీఆర్ఎస్ కూడా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణకు క‌ట్టుబ‌డి ఉంది. ఈ విష‌య‌మై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని క‌లిసేందుకు, అఖిల ప‌క్ష భేటీ అయ్యేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నించారు. ప్ర‌ధాని అపాయింట్మెంట్ కోరారు. ఇచ్చిన‌ట్టే ఇచ్చి… చివ‌రి నిమిషంలో రద్దు చేశారు. దీంతో తెరాస నాయ‌కులు తీవ్ర అసంతృప్తికి గుర‌వుతున్నారు. కేసీఆర్‌తో భేటీ అయ్యేందుకు ఎందుకు టైం ఇవ్వ‌డం లేదంటూ తెరాస ఎంపీలు కేంద్రంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది క‌నుక ఇలాంటి సున్నితాంశంపై ప్ర‌ధాని ఏ ప్ర‌క‌ట‌న చేసినా.. అది ఎన్నిక‌ల్లో ఇంకోర‌కంగా మేలు చేకూర్చే విధంగా మారుతుంద‌ని కేంద్ర‌మంత్రి వెంక‌య్య చెప్పారు. కానీ దీనికి క్రెడిట్ గేమ్ కార‌ణ‌మ‌ట‌!

ఇప్ప‌టికే చాలా విషయాల్లో భాజ‌పాకి క్రెడిట్ ద‌క్క‌లేదు. ఈ విష‌యంలో కూడా కేసీఆర్‌కు క్రెడిట్ ఇవ్వ‌కూడ‌ద‌నేది భాజ‌పా వ్యూహంగా ఉంద‌ని విశ్లేష‌కుల అంశం. కేసీఆర్ అడిగిన వెంట‌నే రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటే.. తెలంగాణ‌లో అది కేసీఆర్ సాధించిన మ‌రో విజ‌యంగా చెప్పుకునే అవ‌కాశం ఎటూ ఉంటుంది. సో… అలాంటి ఛాన్స్ ఇవ్వ‌కుండా కేంద్రం వ్యూహాత్మంగా వ్య‌వ‌హ‌రించింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది!