తెలంగాణ‌లో కేసీఆర్.. ఒంట‌ర‌వుతున్నారా..?

తెలంగాణ‌లో త‌న‌కంటూ తిరుగులేద‌ని భావించిన సీఎం కేసీఆర్‌కి ఇప్పుడు చ‌క్క‌లు క‌న‌బ‌డుతున్నాయా? రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్త‌యిన త‌ర్వాత నెమ్మ‌దిగా ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త మొద‌లవుతోందా? ఇప్పుడు ఓ ర‌కంగా తెలంగాణ‌లో కేసీఆర్ ఒంట‌రి అవుతున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. నిజానికి తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనే మాట ఇప్పుడు నిజంగానే తిర‌గ‌బ‌డుతోంది! ఎన్నిక‌ల స‌మ‌యంలో బంగారు తెలంగాణ ల‌క్ష్యం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో చాలా మ‌టుకు ఇప్ప‌టికీ నెర‌వేర‌క‌పోవడం దీనికి ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ.

అదేస‌మ‌యంలో రాష్ట్రంలో రైతు ఆత్మ‌హ‌త్య‌లు, ఉద్యోగాలు లేక‌పోవ‌డం వంటి అనేక కార‌ణాలు ప్ర‌తిప‌క్షాల‌కు అందివ‌చ్చాయి. నిజానికి రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌ని భావించిన కేసీఆర్‌.. ఇప్ప‌డు అదే ప్ర‌తిప‌క్షాల ధాటికి ప‌రోక్షంలో ర‌గిలి పోతున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయంగా ఎన్నో ఎత్తుల‌కు పైఎత్తులు వేసిన కేసీఆర్‌.. తాజాగా వాటిని ప‌క్క‌న పెట్టి.. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే ప‌నిలో ప‌డ్డారు.

ఒక‌ప్పుడు కేసీఆర్‌కి అండ‌గా ఉన్న కోదండ‌రాం.. విమ‌లక్క వంటి వారు ఇప్పుడు విప‌క్షంగా మారి కేసీఆర్‌పై క‌త్తుల దూస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బృందం మహాజన పాదయాత్ర, ముగింపులో గొప్ప సభ , మిర్చి రైతుల ఆందోళన, ధర్నాచౌక్‌ రణరంగం, నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డి వర్గంతో కాంగ్రెస్‌ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుయాయుల ఘర్షణ వీటన్నిటిని బట్టి ఈ విషయం స్పష్టమవుతుంది.

కేంద్రంలో బీజేపీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తున్నా.. రాష్ట్ర బీజేపీ మాత్రం కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ పొలిటిక‌ల్‌గా క‌న్నా ప్ర‌జ‌ల‌తోనే ఎక్కువ ట‌చ్‌లో ఉంటే బాగుంటుంద‌ని డిసైడ్ అయ్యారంటే ప‌రిస్తితి ఎంత సీరియ‌స్‌గా ఉందో అర్థం అవుతుంది. మ‌రి రాబోయే రెండేళ్ల‌లో ఎలాంటి మార్పులు సంభ‌విస్తాయో చూడాలి.