బ‌న్నీ ” డీజే ” కు యాంటీగా ఆ క్యాస్ట్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమా టీజ‌ర్, పాట‌ల‌తో ఇప్ప‌టికే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. తాజాగా డీజే ఓ కుల‌స్తుల ఆగ్ర‌హానికి గురైంది. ఈ సినిమాకు సంబంధించి గ‌తంలోనే రుద్రాక్షమాల, జీన్స్ ప్యాంట్ తో ఉన్న అల్లు అర్జున్ లుక్‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన బ్రాహ్మ‌ణులు తాజాగా ఇప్పుడు రిలీజ్ అయిన ఓ పాట త‌మ కులాన్ని కించ‌ప‌రిచేలా ఉంద‌ని భ‌గ్గుమంటున్నారు.

డీజే సినిమాలో ఇటీవ‌ల‌ విడుదలైన ‘అస్మైక భోగ, తస్మైక భోగ’ అనే పాటపై బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం వారు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌ముఖ పాట‌ల రచయిత సాహితి రాసిన ఈ పాటలోని లిరిక్స్ లోని పదాలు ‘నమకం.. చమకం’ రుద్ర స్తోత్రాన్ని అవమానించేవిగా ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.

‘‘ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం.. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం’’ అంటూ శివుడికి ప్రీతికరమైన నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావించడంపై వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌దాలు త‌క్ష‌ణ‌మే తొల‌గించ‌ని ప‌క్షంలో తాము ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రుల‌తో పాటు పోలీసు ఉన్న‌తాధికారుల‌ను క‌లిసి ఫిర్యాదు చేస్తామ‌ని వార్నింగ్‌లు ఇస్తున్నారు.

ఇక టాలీవుడ్‌లో ఇటీవ‌ల వ‌స్తోన్న సినిమాల‌పై వివాదాలు కామ‌న్ అయిపోయాయి. ప్ర‌తి ఒక్క‌రు తాము ప‌బ్లిసిటీ అవ్వ‌డం కోస‌మో లేదా ? సినిమాకు ఇలాంటి వివాదాల‌తో మ‌రింత హైప్ వ‌స్తుంద‌న్న కార‌ణాల‌తో ఇలా చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.