ఆనం బ్ర‌ద‌ర్స్‌ను బాబు సైడ్ చేసేశారా..!

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆనం సోద‌రుల పేరు చెపితేనే ఓ క్రేజ్ ఉంటుంది. ఆనం సోద‌రులు కాంగ్రెస్ పాల‌న‌లో నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను ఓ రేంజ్‌లో శాసించారు. కాంగ్రెస్‌లో అధికారంలో ఉన్న రెండుసార్లు వీరు ఎమ్మెల్యేలు అవ్వ‌డంతో పాటు వీరిద్ద‌రు మంత్రులుగా కూడా ప‌నిచేసి జిల్లాను శాసించారు. ఇక గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అవ్వ‌డంతో ఈ సోద‌రులిద్ద‌రు ఎన్నో ఆశ‌ల‌తో త‌మ పాత‌గూడు అయిన టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరిన‌ప్పుడు ఆనం సోద‌రులు త‌మ‌ను ఇక్క‌డ ఏనుగు ఎక్కించి ప‌ల్ల‌కీలో ఊరేగించేస్తార‌ని భావించారు. టీడీపీలో చేరిన కొద్ది రోజుల పాటు వీరు నానా హంగామా చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఆ త‌ర్వాత టీడీపీలో పాత కాపులు వీరికి చెక్ పెట్టారు. ఇక ఆనం సోద‌రులు ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ అయ్యి, మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌ని ఆశించారు. ఆనం రామనారాయ‌ణ‌రెడ్డికి ఆత్మ‌కూరు ఇన్‌చార్జ్ ఇచ్చి స‌రిపెట్టారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ సీటు కోసం వీరు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇక తాజాగా గ‌వ‌ర్న‌ర్ కోటాలో త‌న‌కు ఎమ్మెల్సీ సీటు వ‌స్తుంద‌ని వీరు ఎన్నో ఆశ‌ల‌తో ఉన్నారు. చంద్ర‌బాబు ఈ రెండు సీట్ల‌ను భ‌ర్తీ చేసేశారు. ఒకటి కడప జిల్లా జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డికి చంద్రబాబు ఖరారు చేయగా, తాజాగా నంద్యాల టీడీపీ నేత మాజీ మంత్రి ఫరూక్ కు కేటాయించేశారు. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు భ‌ర్తీ అవ్వ‌డంతో ఇక ఇప్పుడు ఆనం సోద‌రుల‌కు నామినేటెడ్ పోస్టులు మాత్ర‌మే మిగిలాయి. అందులోను ప్రాధాన్య‌త ఉన్న పోస్టుల‌న్నీ అయిపోయాయి. ఇక సాధార‌ణ పోస్టులు తీసుకునేందుకు వారు సిద్ధంగా లేరు. వీరు చట్టసభల్లో అడుగుపెట్టేందుకే మొగ్గు చూపుతున్నారు.

ఇక ఆనం సోద‌రుల‌కు ఎమ్మెల్సీ దారులు శాశ్వ‌తంగా మూసుకుపోయిన‌ట్టే. నెల్లూరు జిల్లా నుంచి మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇద్ద‌రూ ఎమ్మెల్సీలే. ఇక జిల్లా పార్టీ అధ్య‌క్షుడు బీద ర‌విచంద్రయాద‌వ్ కూడా ఎమ్మెల్సీనే. అక్క‌డ జమ్మ‌ల‌మ‌డుగులో రెడ్డి వ‌ర్గానికి చెందిన రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని డిసైడ్ అయిన బాబు మ‌రో రెడ్డి వ‌ర్గానికే ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మైనార్టీ వ‌ర్గానికి చెందిన ఫరూక్‌ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఎమ్మెల్సీ రాద‌ని తేలిపోవ‌డంతో ఆనం సోద‌రులు టీడీపీలో ఉండాలా ? లేదా రాజ‌కీయంగా ఏదైనా కొత్త‌దారి వెతుక్కోవాలా ? అని ఆనం సోద‌రులు పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఆనం సోద‌రులు ఏం చేస్తార‌న్న‌ది ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.