అప్పుడు తండ్రులు..  ఇప్పుడు వార‌సులు.. ఫైటింగ్ సేమ్‌!! 

అనంపురం రాజ‌కీయాల్లో పాత సీన్లే.. ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. గ‌తంలో ఏళ్ల త‌ర‌బ‌డి జ‌రిగిన ఘ‌ట‌న‌లే ఇక‌పైనా జ‌ర‌గ‌నున్నాయి. క‌థ మార‌లేదు కానీ.. క‌థ‌న‌మూ మార‌లేదు.. కేవలం హీరోలే మారారు అంతే! ఆధిప‌త్య‌మే అప్పుడు, ఇప్పుడు ప్ర‌ధాన టాపిక్‌. రాజ‌కీయ‌మే మెయిన్ స్టోరీ అప్పుడు ఇప్పుడు! కాక‌పోతే.. తండ్రుల ప్లేస్‌లో వార‌సులు అంతే!! దీంతో మ‌రోసారి అనంత‌పురం రాజ‌కీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీశాయి. విష‌యంలోకి వెళ్తే.. అనంత‌పురం జిల్లాలో రెండు ప్ర‌ధాన పార్టీలు ఆధిప‌త్య పోరు కోసం రోడ్లెక్కిన విష‌యం తెలిసిందే. ఒక‌ళ్ల‌పై ఒక‌ళ్లు క‌క్ష‌లు, కార్ప‌ణ్యాలు, హ‌త్య‌ల వ‌ర‌కు వెళ్లారు.

వారే.. టీడీపీకి చెందిన ప‌రిటాల ర‌వి వ‌ర్గం కాగా, కాంగ్రెస్‌లో చ‌క్రంతిప్పిన జేసీ దివాక‌ర్ వ‌ర్గం. రాజ‌కీయంగా, వ్యాపారంగా కూడా ఆధిప‌త్య పోరు తార‌స్థాయికి చేరింది. బ‌హిరంగ విమ‌ర్శ‌లు, బూతుల ప‌ర్వం, స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు.. ష‌రా మామూలే. ఈ వ‌ర్గంలో ఏ ఒక్క‌రు బ‌య‌ట‌కు వ‌చ్చినా.. వెన‌కాల వంద మంది ఉండాల్సిందే. ప‌రిస్థితి అంత వ‌ర‌కు చేజారిపోయింది. ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌భుత్వ‌మే(అధికారులు) చేతులు ఎత్తేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, అనూహ్య సంఘ‌ట‌న నేప‌థ్యంలో ప‌రిటాల ర‌వి హ‌త్య జ‌ర‌గ‌డం తెలిసిందే. ఆ స‌మ‌యంలో జేసీ దివాక‌ర రెడ్డిని జిల్లాలోకి అడుగు పెట్ట‌నీయ‌లేదంటే.. ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య పోరు ఎలాంటి తార‌స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. విభ‌జ‌న‌తో కాంగ్రెస్ కొంప కొల్లేరు కావ‌డంతో జేసీ కూడా వ‌చ్చి బాబు గూట్లో చేరిపోయారు. దీంతో ఒక వ‌ర‌లో రెండు క‌త్తుల్లా ప‌రిటాల‌, జేసీ వ‌ర్గాలు ఇప్పుడు ఒకే పార్టీలో బ‌తుకుతున్నాయి. అయినా కూడా ఈ ఇరు ఫ్యామిలీల మ‌ధ్య ప‌గ‌లు, క‌క్ష‌లు ఏమాత్రం చావ‌లేదు. పైగా ఆధిప‌త్య ధోర‌ణి అలానే కొన‌సాగుతోంది. అందుకే ప‌రిటాల సునీత ఎదురుప‌డినా జేసీ ప‌క్క‌కు త‌ప్పుకొని పోతారే త‌ప్ప మ‌హిళ అనిగానీ, మంత్రి అని గానీ ఆమెను ఏనాడూ చూసిందిలేదు. ఇక‌, రాబోయే రోజుల్లో ఈ రెండు కుటుంబాల‌కు చెందిన వార‌సులు దీనినే పుణికి పుచ్చుకుంటార‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ప‌రిటాల వార‌సుడిగా ఆయ‌న ఏకైక త‌న‌యుడు శ్రీరాం, జేసీ వాస‌రుడిగా పవన్ కుమార్ రెడ్డి రాబోయే 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జాక్షేత్రంలో అడుగు పెట్టాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ ఒకే పార్టీ నుంచి ఒకే సీటు నుంచి పోటీచేయాల‌ని భావిస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అనంత‌పురం ఎంపీ సీటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖాళీ అవుతుంది. జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటున్నారు. దీంతో ఆయ‌న త‌న త‌న‌యుడికి త‌న సీటు కేటాయించేలా బాబుపై ఒత్తిడి పెంచే అవ‌కాశం ఉంది.

ఇక‌, ప‌రిటాల సునీత త‌న త‌న‌యుడు శ్రీరాంను కూడా ఎంపీ చేసి మురిసి పోవాల‌ని భావిస్తోంది. దీంతో బాబుపై ఈమె కూడా ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉంది. దీంతో ఈ ఒక్క సీటు కోసం ఇరు కుటుంబాలు రోడ్డున ప‌డే ఛాన్స్ లేక‌పోలేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి అనంతలో సీన్ రిపీట్ అవుతుందేమో చూడాలి.