కొత్త ప‌లుకులో చెత్త ఆలోచనలో…ఈ గ్యాసిప్‌కు అంతేలేదా!

లేనిది ఉన్న‌ట్టు.. ఉన్న‌ది లేన‌ట్టు చెప్ప‌డం కొన్ని ప‌త్రిక‌ల‌కు అల‌వాటుగా మారింద‌నే నానుడి తెలిసిందే. తాజాగా ఆంధ్ర‌జ్యోతి అధినేత ఆదివారం రాసిన కొత్త ప‌లుకు ఈ నానుడిని మ‌రోసారి రుజువు చేస్తోంది! వారం వారం ఎడిట్ పేజీలో అర‌స‌గం పైనే అచ్చొత్తే.. ఈ వ్యాఖ్యానం ఇటీవ‌ల పూర్తి నిరాధారంగా మారిపోయింద‌ని, అతిశ‌యోక్తుల‌కు అడ్డాగా మారిపోయింద‌ని ప‌లువురు చెప్పుకోవ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం. తాజా విష‌యానికి వ‌స్తే.. చాన్నాళ్ల త‌ర్వాత ఏపీ నుంచి రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వైన ఉప‌రా ష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిత్వానికి అచ్చ‌తెలుగు పంచెక‌ట్టుతో ద్యోత‌క‌మ‌య్యే కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడును వ‌రించింది. ఈ ప‌రిణామం నిజంగా ప్ర‌తి తెలుగు వాడినీ ఆనందానికి లోన‌య్యేలా చేసింది.

అయితే, కోడిగుడ్డుపై ఈక‌లు పెరికే సంత‌తి ఉన్న ప్ర‌స్తుత కాలంలో వెంక‌య్య ఉప‌రాష్ట్ర‌ప‌తి నామినేష‌న్‌ను కూడా ఈ కోణంలోనే చూస్తూ.. చెత్త ప‌లుకులకు తెర‌దీశారు స‌ద‌రు ద‌మ్మున్న ప‌త్రికాధినేత వ‌ర్యులు! వెంక‌య్య‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తిగా పంప‌డం ముమ్మాటికీ కుట్రేన‌ని, దీనివెనుక జ‌గ‌న్ అండ్‌కో చ‌క్రం తిప్పింద‌ని, వెంక‌య్యను ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎంపిక చేయ‌డం ఆయ‌న‌ను ఘోరంగా అవ‌మానించిన‌ట్టేన‌ని, ఆయ‌న‌క‌న్నా జూనియ‌ర్ అయిన కోవింద్‌ను రాష్ట్ర‌ప‌తిగా ఎన్నుకున్న నేత‌ల‌కు కేవ‌లం ఉప‌రాష్ట్ర‌ప‌తిగానే వెంక‌య్య‌ను పంపాల‌నే ఆలోచ‌న ఎందుకొచ్చింద‌ని, డామిట్ ఇక్క‌డేదో జ‌గ‌న్ కుట్ర‌ప‌న్నాడ‌ని, అద్బుతంగా సాగిపోతున్న ఇద్ద‌రు నాయుళ్ల స్నేహానికి(చంద్ర‌బాబు నాయుడు, వెంక‌య్య‌నాయుడు) బీట‌లు కొట్టి. తాము ఎద‌గాల‌ని జ‌గ‌న్ వేసిన ప్లాన్‌లో బీజేపీ అధిష్టానం ప‌డిపోయిందంటూ.. మ‌రికొంద‌రి పేర్ల‌తో ఉత్త‌ప‌లుకుల‌కు మ‌సాలా అద్ది కొత్త ప‌లుకులుగా చెప్పేశారు!

వాస్త‌వానికి వెంక‌య్య‌నాయుడులో సామ‌ర్థ్యం, ఆయ‌న సేవ‌లు జ‌గ‌న్ గుర్తు చేస్తే.. గుర్తించేంత స్థితిలో బీజేపీ అధిష్టానం ఉందంటేనే చాల సిల్లీగా ఉంది. అదేస‌మ‌యంలో కోవింద్‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌క‌ముందే విజ‌య‌సాయిరెడ్డి వెళ్లి ఆయ‌న‌ను క‌లుసుకున్నారు. ఇది కూడా త‌ప్పే అన్న‌ట్టుగా కొత్త ప‌లుకు సూత్రీక‌రించింది. ఇందులో త‌ప్పేముంది? ఏదో మార్గంలో రాబ‌ట్టిన సోర్స్ ఆధారంగా విజ‌య‌సాయి కోవింద్‌ను ముందే అభినందించి ఉండొచ్చు. దానికి పెద్ద ఎత్తున అప‌వాదులు అద్దాల్సిన అవ‌స‌రం లేదు. అదేస‌మ‌యంలో అమిషానే జ‌గ‌న్‌కి ప్ర‌ధాని అపాయింట్ మెంట్ ఇప్పించార‌ని చెప్పుకొచ్చారు. అవ‌స‌రాన్ని రాజ‌కీయాలు మారిపోతుంటాయ‌న్న విష‌యం తెలియంది కాదు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అవ‌స‌రం ఉంది కాబట్టి షా దిగివ‌చ్చాడు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో రామ్ మాధ‌వ్ జ‌గ‌న్ కూట‌మితో చేతులు క‌లిపాడ‌ని చెప్ప‌డం ఇంకా వింత‌గా ఉంది. రామ్‌మాధ‌వ్ కూడా వెంక‌య్య‌ను లూప్ లైన్ వంటి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పంప‌డంపై దృష్టి పెట్టాడ‌ని చెప్ప‌డం వింత‌గా ఉంది. ఏపీలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలంటే .. బాబు వ‌ల్ల కాద‌ని, అదే జ‌గ‌న్ అయితే కేసుల్లో ఉన్నాడు కాబ‌ట్టి దాదాపు 40 దాకా బెదిరించైనా సీట్లు ద‌క్కించుకోవ‌చ్చ‌ని షా ప్లాన్ వేశాడ‌ని, అందుకే దీనికి అడ్డుగా ఉన్న వెంక‌య్య‌ను త‌ప్పించార‌ని కొత్త ప‌లుకు చెప్ప‌డం చెత్త చెత్త‌గా ఉంది. మ‌రీ ఇంత దిగ‌జారుడుగా బీజేపీ అధిష్టానం ముందుకు పోద‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే, ఏదో ఒక ర‌కంగా జ‌గ‌న్‌ను బ్లేమ్ చేయ‌డ‌మే ఈ ప‌లుకుల వెనుక అస‌లు సంగ‌తి. ఈ గ్యాసిప్‌కు అంతేలేదా అని విశ్లేషకులు నోరెళ్ల బెడుతున్నారు.