రామోజీ – రాధాకృష్ణ చంద్ర‌బాబుకు ఎవ‌రు ఎక్కువ‌..!

మీడియా మేనేజ్‌మెంట్‌లో సీఎం చంద్ర‌బాబును మించిన వారు లేర‌నే చెప్పుకోవాలి! ముఖ్యంగా అల‌నాడు ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన ఈనాడుతోనే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాయించి.. ప‌ద‌వి నుంచి దింపించేశారు. ఆ త‌ర్వాత అదే ప‌త్రిక ఆయ‌న‌కు అండ‌గా నిలబడుతూ వ‌స్తున్న విషయం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఇప్పుడు ఈనాడు ప‌త్రికను ప‌క్క‌న పెట్టేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. దాని కంటే మిన్న‌గా, ప్ర‌భుత్వాన్ని భుజాల‌పై మోస్తున్న ఆంధ్ర‌జ్యోతిని అంద‌లం ఎక్కించాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనికి తోడు ఆయ‌న త‌న‌యుడు లోకేష్ కూడా జ్యోతికే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తుండం కూడా వీటికి బ‌లం చేకూరుస్తోంది.

మీడియా రంగంలో ముఖ్యంగా ప‌త్రికా రంగంలో.. ఈనాడు అగ్ర‌స్థానంలో ఏళ్ల నుంచి నిలుస్తోంది. ప్ర‌స్తుతం దీనికి పోటీగా ఆంధ్ర‌జ్యోతి ఎదుగుతోంది. ఇదే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు దృష్టిని ఆక‌ర్షించింది. ఆయ‌న‌కు ఈనాడు అధినేత రామోజీరావుతో ఎంత స‌త్సంబంధాలు ఉన్నాయో.. అంతేస్థాయిలో ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌తోనూ ఉన్నాయి. ప్ర‌స్తుతం రామోజీరావు కంటే రాధాకృష్ణ‌నే టీడీపీకి పూర్తిస్థాయిలో ప్ర‌చారం ఇస్తుండ‌టంతో.. చంద్ర‌బాబు కూడా ఆంధ్ర‌జ్యోతికే తొలి ప్రాధాన్య‌మిస్తున్నార‌ట‌. ఇదేస‌మ‌యంలో రామోజీరావు నిర్ణ‌యాలు కూడా ఆయ‌న్ను కొంత గంద‌ర‌గోళానికి గురిచేస్తున్నాయ‌ట‌.

మీడియాలో తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఈనాడుపై ఆధారపడలేమని టీడీపీ దాదాపు నిర్ణయానికి వచ్చేసిందట. ఇటీవల వైసీపీ అద్యక్షుడు జగన్‌కు ఈనాడు ప్రచారం ఇవ్వడం టీడీపీకి మింగుడుపడటం లేదు.

జగన్‌ను వ్యతిరేకించే విషయంలో ఆంధ్రజ్యోతి ఆర్కే ఏ మాత్రం రాజీ పడరని అందరికీ తెలిసిన విష‌య‌మే! కేసీఆర్, టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆంధ్ర‌జ్యోతి వ్య‌వ‌హార శైలి మారిన విష‌యం తెలిసిందే! గ‌తంలో బ్యాన్ విధించినా.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఇద్ద‌రూ పాత స్నేహాన్ని కొన‌సాగిస్తున్నారు. ఈ సమస్య ఉన్నా జగన్‌ కోణంలో మాత్రం ఆంధ్రజ్యోతి రాజీ పడబోద‌ని.. క‌నుక వారిపై ఆధారపడదామని నిర్ణయించుకుట్టున్నారు టిడిపి నేతలు.

ఈనాడు అన్ని ప్రభుత్వాలకూ ప్రచార పత్రికలా మారందిని ఆంధ్రజ్యోతి మాత్రం వైవిధ్యం కొనసాగిస్తున్నదని అంచనా వేశారట.కేంద్రంలో బీజేపీని, హైదరాబాదులో ఆస్తుల రీత్యా తెలంగాణలో కేసీఆర్‌ను కాపుకాయాలనే తాపత్రయం ఎక్కువైన ఈనాడు.. తమను వెనక్కు నెడుతోంద‌ని టీడీపీ యువనేత లోకేష్ కూడా నిర్ధారణకు వచ్చేశార‌ట‌. దీంతో ఈనాడు కంటే ఆంధ్రజ్యోతిపైనే అధికంగా ఆధారపడుతున్నారట. త‌మ కోసం శాయ‌శ‌క్తులా శ్ర‌మిస్తున్న ప‌త్రిక‌కు.. ఆర్థికంగా చేత‌నైన సాయం చేయాల‌ని డిసైడ్ అయిపోయార‌ట‌. అడ్వర్టయిజ్‌మెంట్లు, ప్రభుత్వ అవసరాలు వంటివి అధికారికంగానే అప్పజెప్పి సంస్థ‌కు ఆర్థికంగా సాయం అందిస్తూ బలోపేతం చేస్తున్నార‌ని స‌మాచారం.