టీడీపీకి మ‌రో కేంద్ర మంత్రి ప‌ద‌వి..!

ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగిన కొద్ది రోజుల‌కే కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ కూడా జ‌ర‌గ‌నుంది. ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఎంత ఉత్కంఠ క్రియేట్ చేసిందో ? ఇప్పుడు కేంద్ర కేబినెట్ ప్ర‌క్షాళ‌న కూడా అదే స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఈ నెల 27న కేంద్ర కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సీనియ‌ర్ ఎంపీల‌ను, జూనియ‌ర్ల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ ఈ సారి మోడీ కేబినెట్ కూర్పు ఉంటుంద‌ని స‌మాచారం.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకునే ఈ కేబినెట్‌లో మార్పులు – చేర్పులు ఉంటాయంటున్నారు. తాజా ప్ర‌క్షాళ‌న‌లో ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీకి మూడో కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుందంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీకి ఇప్ప‌టికే రెండు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. సుజానా చౌద‌రితో పాటు అశోక్‌గ‌జ‌ప‌తిరాజు మంత్రులుగా ఉన్నారు.

ఇక బీజేపీలో ఇటీవ‌ల కిడ్నీమార్పిడి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న సుష్మాస్వ‌రాజ్‌ను త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా పంపి రాజ‌స్థాన్ సీఎం వ‌సుంధ‌ర రాజేను కేంద్ర మంత్రిగా చేస్తార‌ని టాక్‌. రాజేకు విదేశాంగ శాఖ ఇస్తార‌ని వార్త‌లు వస్తున్నాయి. ఇక యూపీ సీఎం రేసులో చివ‌రి వ‌ర‌కు ఉన్న మ‌నోజ్‌సిన్హాకు కూడా కీల‌క ప‌ద‌వి వ‌స్తుందంటున్నారు.

ఇక ఏపీలో టీడీపీకి ద‌క్కే మూడో ప‌ద‌వి కోసం ఇద్ద‌రు బీసీ కోటాలో మ‌చిలీప‌ట్నం ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, కాపు సామాజిక‌వ‌ర్గం కోటాలో కాకినాడ ఎంపీ తోట న‌ర‌సింహం పోటీ ప‌డుతున్నారు. చంద్ర‌బాబు స్టేట్ కేబినెట్‌లో బీసీల‌కే ఎక్కువ ప్ర‌యారిటీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీసీ ఓట్ల‌నే ప్ర‌ధానంగా టార్గెట్ చేసే క్ర‌మంలో కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌కే కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న చ‌ర్చ‌లు టీడీపీలో వినిపిస్తున్నాయి.