నంద్యాలే కాదు… అక్కడ ఎన్నిక కూడా హోరా హోరీనే

ఏపీలో ఇప్పుడు జనం దృష్టి అంతా కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికపైనే ఉంది. ఈ ఉప ఎన్నిక ఈ నెల 23న జ‌రుగుతుండ‌గా, కౌంటింగ్ 28న జ‌రుగుతోంది. ఆ మ‌రుస‌టి రోజే కాకినాడ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 1న కౌంటింగ్ జ‌రుగుతోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయ‌డంతో ఇప్పుడు కాకినాడ‌లో ఎన్నికల హీట్ బాగా పెరిగిపోయింది.

కాకినాడ కార్పొరేష‌న్‌కు 2015లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఏడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అక్క‌డ ఎన్నిక‌లు జరుగుతున్నాయి. ఇప్ప‌టికే నంద్యాల ఎన్నిక తెలుగు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఓ రేంజ్‌లో హీట్ రేపుతుంటే ఆ ఎన్నిక ఫ‌లితం వ‌చ్చిన మ‌రుస‌టి రోజే కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక జ‌రుగుతుండ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. ఈ నెల 7 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 10గా ప్రకటించారు. ఆగస్టు 29న పోలింగ్ జరగనుండగా సెప్టెంబర్1న ఫలితాలు ప్రకటించనున్నారు.

కాకినాడ కార్పొరేష‌న్ ప‌రిధిలో కాకినాడ న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గంతో పాటు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని ఏరియాలు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ రెండు నియోజ‌క‌వర్గాల్లోను టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. టౌన్ నుంచి వ‌న‌మాడి వెంక‌టేశ్వ‌ర‌రావు, రూర‌ల్ నుంచి పిల్లి అనంత‌ల‌క్ష్మి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక కాకినాడ ఎంపీగా కూడా టీడీపీకే చెందిన తోట న‌ర‌సింహం ఉన్నారు.

ఇక ప్ర‌స్తుతం టీడీపీ అధికారంలో ఉండ‌డంతో కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ను టీడీపీ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. అయితే ఇక్క‌డ వైసీపీ కూడా బ‌లంగానే ఉంది. దీంతో ఇరు పార్టీల మ‌ధ్య నంద్యాల‌లాగానే హోరాహోరీ పోరు కొన‌సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక కార్పొరేట‌ర్ సీట్ల‌లో రిజ‌ర్వేష‌న్ల విష‌యానికి వ‌స్తే బీసీలకు 17, ఎస్సీలకు 4, ఎస్టీల‌కు 1, మహిళలు (జనరల్‌) 15, అన్‌రిజర్వ్‌డ్‌ (జనరల్‌) 13 సీట్లు కేటాయించారు