2019 వార్‌: ఏపీ, తెలంగాణ‌లో ఎవ‌రు ఎవ‌రికి ఫ్రెండో..!

2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం ఉంది. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల టైం ప‌క్కన పెట్టేస్తే 15 నెల‌లు మాత్ర‌మే ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎవ‌రితో జ‌ట్టు క‌డ‌తారు ? అధికార పార్టీల‌ను ఢీకొట్టేందుకు కొత్త పొత్తుల లెక్క ఏంట‌న్న‌దానిపై ఊహాగానాలు, చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. రెండు చోట్లా కామ‌న్ పాయింట్ ఏంటంటే అధికార పార్టీల‌ను ఓడించేందుకు విప‌క్షాల‌న్ని ఒకే కూట‌మిగా ఏర్ప‌డేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లోను వేర్వేరు ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఏపీలో లెక్క ఇది…

ఏపీలో టీడీపీకి మిత్ర‌ప‌క్షమైన బీజేపీ తెలంగాణ‌లో మాత్రం టీడీపీతో క‌లిసి వెళ్లే ప‌రిస్థితి లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల వేళ బీజేపీ అధికార టీఆర్ఎస్‌తో జ‌ట్టుక‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇక ఏపీలో పొత్తుల విష‌యానికి వ‌స్తే టీడీపీ +బీజేపీ క‌లిసి వెళితే విప‌క్ష వైసీపీ వీటికి పోటీ పార్టీగా ఉంటుంది. ఇక కొత్త‌గా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న జ‌న‌సేన, లోక్‌స‌త్తా, క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి ముందుకు వెళ్లే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భావ‌జాలం కాస్త లోక‌స‌త్తాకు, క‌మ్యూనిస్టుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో ఈ కూట‌మి ఏర్ప‌డేందుకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ సైతం క‌మ్యూనిస్టుల‌తో జోడీ క‌ట్టేందుకు రెడీగా ఉన్న సంకేతాలే పంపుతున్నారు. క‌మ్యూనిస్టుల‌కు సీట్లు లేక‌పోయినా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేసే ఓటు బ్యాంకు అయితే ఉంది. దీంతో జ‌గ‌న్ సైతం వీళ్ల‌ను క‌లుపుకునేందుకు ఆస‌క్తిగానే ఉన్నాడు. ఇక రాష్ట్ర విభ‌జ‌న పాపం మూట‌క‌ట్టుకున్న కాంగ్రెస్‌ను కలుపుకుని వెళ్లేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌రు.

తెలంగాణ‌లో చిత్ర విచిత్ర ప‌రిస్థితి….

ఏపీతో పోలిస్తే తెలంగాణ‌లో పొత్తులు చిత్ర విచిత్రంగా ఉండే ఛాన్సులు ఉన్నాయి. కేసీఆర్ ఎన్డీయేకు ద‌గ్గ‌ర‌వుతోన్నందున అక్క‌డ టీఆర్ఎస్‌+బీజేపీ క‌లవ‌చ్చు. లేదా ఒంట‌రిగా అయినా పోటీ చేయ‌వ‌చ్చు. ఇక కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రావాలంటే ఇతరులను కలుపుకుని పోవాల్సి ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌తో క‌మ్యూనిస్టులు క‌ల‌వ‌చ్చు. ఇక టీ టీడీపీ సైతం కేసీఆర్‌ను గ‌ద్దె దింపేందుకు కాంగ్రెస్ కూట‌మిలో చేరేందుకు సంకేతాలు పంపుతోంది.

టీడీపీకి తెలంగాణలో నాయ‌కులు లేక‌పోయినా, బ‌ల‌మైన ఓటు బ్యాంకు కొంత ఉండటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక కేసీఆర్ అంటే మండిప‌డుతోన్న ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్‌, జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం, జ‌న‌సేన లాంటి పార్టీలు సైతం అక్క‌డ థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్ప‌ర‌చ‌వ‌చ్చంటున్నారు.

ఏదేమైనా 2019లో ఏపీ, తెలంగాణ‌లో కూట‌ములు ఏర్ప‌డ‌డం అయితే ఖాయం. మ‌రి వీటి వ‌ల్ల అధికార పార్టీల‌కు ల‌బ్ధి క‌లుగుతుందా ? లేదా ప్ర‌తిప‌క్షాలు అధికార పార్టీల దూకుడు క‌ళ్లెం వేసి అధికారంలోకి వ‌స్తాయా ? అన్న‌ది చూడాలి.