కేసీఆర్‌ను టెన్ష‌న్ పెడుతున్న ఏపీ విస్త‌`ర‌ణం`

ఏపీలో విస్త‌ర‌ణ సెగ‌లు పూర్తిగా చ‌ల్లార‌లేదు. అధినేత చంద్ర‌బాబు.. ఈ జ్వాల‌ల‌ను ఆర్పేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సీనియ‌ర్ల‌కు ఇప్పుడు మొండిచేయి ఎదుర‌వ‌డంతో వారంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టెన్ష‌న్ పుట్టిస్తున్నాయ‌ట‌. త్వ‌ర‌లో తెలంగాణ‌లోనూ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే చాలా మంది నేత‌లు మంత్రి ప‌ద‌వి కోసం ఎదురు చూస్తున్నారు. మార్పులు చేర్పులు చేస్తే.. అసంతృప్తుల‌ను ఏవిధంగా చ‌ల్లార్చాల‌నే అంశాల‌పై క‌స‌ర‌త్తు ప్రారంభిస్తున్నార‌ట కేసీఆర్‌.

టీడీపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ దుమారం రేపింది. ప‌ద‌వులు ఆశించిన సీనియ‌ర్లు బాహాటంగానే త‌మ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. వీరంద‌రినీ చంద్ర‌బాబు.. న‌యానో భ‌యానో తన దారికి తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోనూ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డితే ఇలాంటి ప‌రిస్థితులే ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. తెలంగాణ క్యాబినెట్లో మార్పులు-చేర్పులు చేయాల్సి వ‌స్తే.. దుమారం ఖాయ‌మ‌నే చ‌ర్చ మొద‌లైంది. కొత్త‌గా కేబినెట్లోకి ఎవ‌రిని తీసుకోవాల‌నే అంశంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తీవ్ర క‌స‌ర‌త్తే చేశారు.

అన్ని ప్రాంతాలు, సామాజిక‌వ‌ర్గాలు, బ‌లాబలాలు అన్నీబేరీజు వేసుకుని మంత్రి సీటు కేటాయించారు. మ‌రి తెలంగాణ‌లోనూ దాదాపు ఇదే ప‌రిస్థితి కనిపించ‌వ‌చ్చు. ఆశావ‌హులు ఎంతోమంది ఉన్నారు. కేబినెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హిళ‌లకు ప్రాధాన్యం లేదు. ముఖ్యంగా బీసీ వ‌ర్గ‌పు నేత‌లు ఆశ‌గా ఉన్నారు. ఇక ప్రస్తుతం మంత్రివ‌ర్గంలో ఉన్న‌వారిపై వేటు త‌ప్ప‌దు. దీంతో కేబినెట్ విస్త‌ర‌ణ చేప‌డితే ర‌చ్చ త‌ప్పద‌ని కేసీఆర్ ఫిక్స్ అయిపోయార‌ట‌. అందుకే ముందుగా నామినేటెడ్ పోస్టుల‌ను కొంత‌మందికి ఇస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌.

నామినేటెడ్ ప‌ద‌వుల‌ను ముందుగా ప్ర‌క‌టించి..త‌ర్వాత మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డితే కొంత‌వర‌కూ అసంతృప్తిని చ‌ల్లార్చ‌వ‌చ్చ‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. అలాగే మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న వారికి ముందుగానే హామీలు ఇవ్వాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. అయితే ఏపీలో అసంతృప్తుల‌కు వైసీపీ మిన‌హా ఆప్ష‌న్స్ లేవు. కానీ తెలంగాణ‌లో.. బీజేపీ, కాంగ్రెస్‌లు ఉన్నాయి. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డితే.. ఇక త‌ద‌నంద‌ర ప‌రిస్థితుల‌ను కేసీఆర్ ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తిక‌రంగా మారింది.