బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడ‌ర్లు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న తెలుగు నేల‌పై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మ‌ళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాల‌న దిశ‌గా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయ‌క‌త్వం అజ‌మాయిషీనే చెల్లుబాటు అవుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్న‌టికి నిన్న విజ‌య‌వాడ న‌డిబొడ్డున బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. ఏపీకి తామే అంతా చేస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు.

ఒక ర‌కంగా అమిత్ వ్యాఖ్య‌లు ఏపీకి తాము లేకుంటే ఏమీ లేద‌నే సిగ్న‌ల్స్‌నే పంపింది. అంతేకాదు, జూలైలో విశాఖ‌కు వ‌చ్చే ప్ర‌ధాని మోడీకి ఎంత‌టి ఘ‌న స్వాగ‌తం ప‌లికాలో కూడా దిశానిర్దేశం చేసేశారు. ఇలాంటి త‌రుణంలో ముఖ్యంగా ఏపీ ప్ర‌జ‌ల‌పై బీజేపీ ఆధ‌ప‌త్యం ప‌క్కాగా క‌నిపించింది. అయితే, ఇదే స‌మ‌యంలో ఏపీలో అధికార పార్టీ కానీ, విప‌క్షం వైసీపీ కానీ ఒక్క‌మాటంటే మాట కూడా బీజేపీకి వ్య‌తిరేకంగా మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రం తీర‌ని ఆర్థిక లోటులో ఉంద‌ని, విభ‌జ‌న‌తో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని, ఆర్థిక లోటును పూడ్చ‌డంలో కేంద్రం అలివిమీరిన నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని నిన్న‌టి వ‌ర‌కు పెద్ద ఎత్తున ఆరోపించిన అధికార విప‌క్షాలు రెండూ మౌనం పాటించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రేప‌టి నుంచి మొద‌ల‌య్యే టీడీపీ మ‌హానాడులో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున చ‌ర్చించాల‌ని నేత‌లు అజెండా ఖ‌రారు చేసుకున్నారు.

ఇంత‌లోనే అమిత్ షా.. విజ‌య‌వాడ రావ‌డం.. తాము ఏపీకి ఎంతో చేస్తున్నామ‌ని అంకెలు, సంఖ్య‌లు స‌హా వివ‌రించ‌డం జ‌రిగిపోయింది. దీనిని ఖండించేందుకు అటు టీడీపీ ఇటు వైసీపీలు ఏవీ ముందుకు రాలేదు. స‌రిక‌దా.. ఏ ప‌త్రికా కూడా “షా”కు వ్య‌తిరేకంగా ఎలాంటి క‌థ‌నాల‌నూ రాయ‌డానికి సాహ‌సించ‌లేదు. మ‌రోప‌క్క‌, ఉత్త‌రాదివారి ఆధిప‌త్యాన్ని స‌హించేది లేద‌ని ఇప్ప‌టికే అనేక వేదిక‌ల‌పై స్ప‌ష్టం చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌.. కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ట్వీట్ చేయ‌లేదు. వీరంతా మౌనం పాటించారంటే.. మ‌రి నిజంగానే కేంద్రం నుంచి ఏపీకి రావాల్సినవి అన్నీ వ‌స్తున్నాయ‌నే అనుకోవాలా?!

ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ లెక్క‌లేన‌న్ని కేసుల‌తో స‌త‌మ‌త‌మవుతుండ‌డంతో పాటు ఆయ‌న ఇటీవ‌లే మోడీని సైతం క‌లిసి వ‌చ్చారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇస్తే జ‌గ‌న్‌కు కేసుల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ఉంటుంద‌న్న హామీ ఆయ‌న‌కు వ‌చ్చి ఉంటుంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అందుకే జ‌గ‌న్ అమిత్ షా ఏపీకి ఎంతో చేశాం అని ఊక‌దంపుడు లెక్క‌లు చెప్పినా అస్స‌లు నోరు మెద‌ప‌లేదు.

ఇదిలావుంటే.. తెలంగాణ‌కు అంతిచ్చాం.. ఇంతిచ్చాం అని అమిత్ షా చేసిన ప్ర‌సంగంపై అక్క‌డి సీఎం కేసీఆర్ తారా జువ్వ‌లా ఎగిరారు. పెద్ద ఎత్తున క‌డిగిపారేశారు. మ‌రోప‌క్క‌,. మోడీ ఇష్టం అంటూనే అమిషా వ్యాఖ్య‌ల‌పై విరుచుకుప‌డ్డారు. మ‌రి ఆ మాత్రం ఏపీలో అమిత్‌కి ఎదురొడ్డే నాధుడే క‌రువ‌వ‌డం గ‌మ‌నార్హం.