ఆ ఏపీ మంత్రి వసూళ్ల దందా

ఏపీలో సీఎం చంద్ర‌బాబు త‌ర్వాత ఆ రేంజ్‌లో క్రేజ్ తానొక్క‌డికే ఉంద‌ని ఆ మంత్రి ఎప్పుడూ గొప్ప‌లు పోతుంటారు. మీడియా వ‌ర్గాల్లోను ఆయ‌న ప‌దే ప‌దే అలాగే చెప్పుకుంటూ ఉంటారు సుమా..! ఆ స్వ‌యం ప్ర‌క‌టిత నిప్పు మంత్రి జిల్లాలో తాను త‌ప్ప పార్టీలోనే ఎవ్వ‌రిని ఎద‌గ‌నీయ‌ర‌న్న విమ‌ర్శ ఉంది. ఇది విమ‌ర్శే కాదు నిజ‌మే. ఇక అవినీతి అనేది త‌న ఇంటా వంటా లేద‌ని గొప్ప‌లు పోయే ఆ మంత్రి ఇప్పుడు చిన్నా చిత‌కా స్థాయిలో కూడా అవినీతికి గేట్లు ఎత్తేశారు. రాజ‌ధాని స‌మీప జిల్లాకు చెందిన స‌ద‌రు మంత్రి ఆ జిల్లాలో 2.5 కోట్ల రూపాయ‌ల అక్ర‌మ వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టు టాక్ లీక్ అయ్యింది.

స‌ద‌రు మంత్రి అక్ర‌మ వ‌సూళ్ల విష‌యాన్ని టీడీపీ వ‌ర్గాలే స్వ‌యంగా ఒప్పుకుంటున్నాయి. ఇక స‌ద‌రు మంత్రికి తెలియ‌కుండా జిల్లాలో ఏం చేయ‌డానికి వీళ్లేద‌ని కూడా అన‌ధికారికంగా వార్నింగ్‌లు కూడా జారీ అయ్యాయ‌ట‌. తాజాగా ఓ ఫార్మా కంపెనీకి చెందిన ఓ భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లో స‌ద‌రు మంత్రి అర‌కూటి రూపాయ‌ల విలువ ఉన్న ఓ షాప్‌ను బెదిరింపుల‌తోనే లాగేసుకున్నారు. ఈ విష‌యంలో వారు ఎంతో కొంత ముట్ట‌చెపుతాం…షాప్ ఇవ్వ‌లేమ‌ని చెప్పినా స‌ద‌రు మంత్రి అనుచ‌రుడు వార్నింగ్ ఇచ్చి మ‌రీ ఆ షాపును మంత్రి ప‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఆ జిల్లాలోని కీల‌క న‌గ‌రంలో ఓ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లో ఎప్ప‌టి నుంచో వ్యాపారం చేసుకుంటోన్న వారిని అక్క‌డే కొన‌సాగించేందుకు వీలుగా మంత్రి గ్యాంగ్ రూ.2 కోట్ల వ‌సూళ్లకు పాల్ప‌డింది. ఈ విష‌యాన్ని స‌ద‌రు వ్యాపార వ‌ర్గాలే ఓపెన్‌గా చెపుతున్నాయి. ఇందులో మెజార్టీ వాటా ఆ మంత్రికి, త‌ర్వాత వాటా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేకు వెళ్లిన‌ట్టు వ్యాపారులు చెపుతున్నారు.

షాక్ ఏంటంటే వ్యాపారులు మామూళ్లు స‌మ‌ర్పించుకున్నాక ఇప్పుడు ఆ కాంప్లెక్స్‌ల కోసం మ‌ళ్లీ టెండ‌ర్లు పిల‌వాల‌ని మునిసిప‌ల్ కార్పొరేష‌న్ డిసైడ్ అయ్యింది. దీంతో వ్యాపారులు మామూళ్లు ఇచ్చుకున్నాక ఇదేంటని మంత్రి తీరుపై మండిప‌డుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోనే కాకుండా స్టేట్‌లో కూడా స‌ద‌రు మంత్రి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న కీల‌క శాఖ‌లో సైతం ఆయ‌న‌కు భారీగానే మామూళ్లు వెళుతున్నాయ‌ట‌. పైకి నిప్పుగా చెప్పుకుంటూ లోప‌ల ఇలాంటి తుప్పు ప‌నులు చేస్తోన్న స‌ద‌రు మంత్రి వ్య‌వ‌హారం ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.