క‌ట్ట‌ప్ప ప్ర‌శ్న‌కు..ఏపీ మంత్రికి లింకేంటి..!

కేబినెట్‌లో ఆ ఒక్క సీనియ‌ర్ మంత్రి ఏకాకిగా మారిపోయారు. ఆయ‌న్ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు స‌రిక‌దా ఆయ‌న త‌ర‌ఫున ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా మాట్లాడ‌టం లేదు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నా.. రాజ‌ధాని భూ కేటాయింపుల క‌మిటీలో చోటు ద‌క్కించుకోలేక‌పోయిన ఆయ‌న మ‌రెవ‌రో కావు కేఈ కృష్ణ‌మూర్తి! కేబినెట్లో జూనియ‌ర్, సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌కు ద‌క్కింది.. మ‌రి సీనియ‌ర్ అయిన ఆయ‌న‌కు మొండిచెయ్యి ఎదురైంది. దీనికి వివ‌ర‌ణ ఇస్తున్న మంత్రులు కూడా.. కేఈని సైడ్ చేసి మాట్లాడుతున్నారు. దీంతో ఆయ‌న ఆట‌లో అరిటి పండులా మారిపోయారు!!

కీల‌క‌మైన భూ కేటాయింపుల క‌మిటీలో రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి కె.ఇ. కృష్ణ‌మూర్తికి ఎందుకు చోటివ్వ‌లేదు? ఈ ప్ర‌శ్న గ‌డ‌చిన రెండ్రోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క‌మిటీలో సీఎం కుమారుడు నారా లోకేష్ కి కూడా చోటిచ్చి ఆ శాఖ‌కు చెందిన మంత్రిని తీసుకోక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌కీ, కె.ఇ.కి క‌మిటీలో ఎందుకు స‌భ్య‌త్వం ద‌క్క‌లేదంటే… స్టాన్ ఫోర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుకుని, ప్ర‌జాసేవ కోసం లోకేష్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌నీ, ఆయ‌న‌కి భూకేటాయింపుల క‌మిటీలో ప్రాధాన్య‌త ఇస్తే త‌ప్పేముంద‌ని ఎదురు ప్ర‌శ్నించారు టీడీపీ అధికార ప్ర‌తినిధి డొక్కా మాణిక్య వ‌రప్ర‌సాద్‌!

ఇక మ‌రో మంత్రి కొల్లు ర‌వీంద్ర కూడా ఇదే అంశ‌మై స్పందించారు. మంత్రి వ‌ర్గ స‌భ్యుడిగా సంబంధిత క‌మిటీల‌న్నింటిలోనూ ఉండే అర్హ‌త నారా లోకేష్ కు ఉంటుందనీ, రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయ‌నీ, వాటికి సంబంధించిన భూకేటాయింపులు లోకేష్ ద‌గ్గ‌రుండి చూసుకుంటే బాగుంటుంద‌ని క‌మిటీలో స‌భ్య‌త్వం క‌ల్పించార‌న్నారు! ఇక ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్ర‌సాద్ కూడా స్పందించారు. క‌మిటీలో సీనియ‌ర్ మంత్రుల్ని నియమించాల‌న్న నిబంధ‌న ఏదైనా ఉందా..? క‌మిటీలో ఉన్న మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు బీసీ కాదా.. అంటూ స్పందించారు! ఇలా ఎవ‌రికి వారు దాట‌వేస్తున్నారు త‌ప్ప అస‌లు రీజ‌న్ చెప్ప‌డం లేదు.

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే దానికి కూడా స‌మాధానం ఉంటుంది గానీ.. కేఈని ఎందుకు తీసుకోలేద‌ని ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం ల‌దొరికేలా లేదు. మరి ఈవిష‌యంపై కేఈ ఏవిధంగా స్పందిస్తారో!!