ఇద్ద‌రు ఏపీ మంత్రుల‌పై లైంగీక వేధింపుల ఆరోప‌ణ‌లు

అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా బాబు స‌ర్కారుపై ఎక్కేసే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. నిన్న రాఖీ పండ‌గ సంద‌ర్భంగా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఏపీ మంత్రులంద‌రూ కంత్రీల‌ని, టీడీపీ ఎమ్మెల్యేలు కాల‌కేయుళ్ల‌ని భారీ స్తాయిలో విరుచుకుప‌డింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇద్ద‌రు మంత్రుల‌కు కామ కోరిక ఎక్కువ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వారిద్ద‌రిపైనా లైంగిక వేధింపుల కేసులు కూడా ఉన్నాయ‌ని చెప్పింది. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లు కూడా న‌డిచే స్వ‌తంత్రం లేద‌ని, కాల్ మ‌నీ పేరుతో వ్య‌భిచారంలోకి దింపేశార‌ని ఆరోపించింది. అలాంటి రాష్ట్రంలో చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు లోకేష్‌లు రాఖీలు క‌ట్టించుకునే అర్హ‌త లేద‌ని ఫైరైంది. ఇంకా ఏ మందంటే..

“ ఏపీలో ఇద్దరు మంత్రులు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. దేశంలో నలుగురిపై ఇలాంటి ఆరోపణలు ఉంటే..అందులో ఇద్దరు ఏపీకి చెందిన వారే కావటం దారుణం. ఏపీలో టీడీపీ పాలనలో మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు. ఒకపక్క రాష్ట్రంలో మహిళలను వేధిస్తూ.. మరోవైపు మహిళా సాధికారత అంటూ చంద్రబాబు వల్లమాలిన ప్రేమ నటిస్తున్నారు. మహిళను రక్షించడంలో ఘోరంగా విఫలమైన చేతకాని ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని మహిళలకు రాఖీ శుభాకాంక్షలు చెబుతారు. రాష్ట్రంలో సూదిగాళ్ల పాలన నడుస్తోంది“ అంటూ సినీ డైలాగుల‌తో రోజా రెచ్చిపోయింది.

`‘ఒక మహిళా కేంద్ర మంత్రిని కూడా వేధించిన చరిత్ర ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులుండటం దౌర్భాగ్యం. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి నిత్యం మహిళా ఉద్యోగులను వేధిస్తున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మహిళలను హింసించేవారిని టీడీపీ పెద్దలు వెనకేసుకు వస్తున్నారు. చంద్రబాబు మంత్రులంతా కంత్రీలు, ఎమ్మెల్యేలంతా కాలకేయుళ్లు. ఎస్టీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులు మెస్‌ చార్జీలు పెంచమని విశాఖలో పోరాడితే జుట్టు పట్టి లాగారు. తుందురులో ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినదించిన మహిళలను బట్టలు చించి కొట్టార‌ని ఆమె తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తింది.

అంగన్‌వాడీ మహిళలను బ్లౌజులు చినిగిపోయేలా కొట్టారు. విజయవాడ కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌తో బెదిరించి ఎంతో మంది అమాయక మహిళలను వ్యభిచారంలోకి దించేశారు“ అని రోజా త‌న క‌డుపులో ఉన్న క‌సినంతా మాట‌ల్లో పెట్టి క‌క్కేసేశారు. మ‌రి ఈ కామెంట్ల‌పై టీడీపీ మ‌హిళా నాయ‌కురాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఆ ఇద్ద‌రు మంత్రులు ఎవ‌రు..!

రోజా చంద్ర‌బాబు స‌ర్కార్‌ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేయ‌డంతో పాటు ఇద్ద‌రు మంత్రులు లైంగీక కేసుల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నార‌ని చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఆ ఇద్ద‌రు మంత్రులు ఎవ‌రా ? అని ఎవ‌రికి వారు ఆరాలు తీస్తున్నారు. ఇందులో ఓ మంత్రి ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన వ్య‌క్తి అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌నపై ఓ ఐఏఎస్ ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రో మంత్రి పేరు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.