పురందేశ్వ‌రిపై కుట్ర వెన‌క ఆ ఇద్ద‌రు..!

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీలో ఎదిగేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఆ పార్టీని ఆద‌రించేందుకు ఏపీ ప్ర‌జ‌లు ఎంత‌మాత్రం సిద్ధంగా లేరు. ఏపీలో ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీడీపీతోనో లేదా వైసీపీతోనో పొత్తు లేకుండా బీజేపీ వార్డు మెంబ‌ర్ సీటు కూడా సొంతంగా గెల‌వ‌లేదు. అది ఇక్క‌డ బీజేపీ స‌త్తా. ప్ర‌స్తుతం టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ రాజ‌కీయ స్వ‌లాభం కోసం అటు వైసీపీతో అయినా క‌లిసి వెళ్లేందుకు సిద్ధ‌మ‌న్న సంకేతాలు ఇస్తూ డ‌బుల్ గేమ్ ఆడుతోంది. బీజేపీ డ‌బుల్ గేమ్‌ను ఏపీ ప్ర‌జ‌లు నిశితంగా గ‌మ‌నిస్తూనే ఉన్నారు.

ఇక నిన్న‌టి వ‌ర‌కు ఏపీ బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి వెంక‌య్య‌నాయుడు ఉప రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు ఏపీ బీజేపీకి పెద్ద దిక్కుగా ఎవ‌రో ఒక‌రు రావాల్సి ఉంది. నిన్న‌టి వ‌ర‌కు ఏపీ బీజేపీలో ఏం జ‌రిగినా వెంక‌య్య కనుస‌న్న‌ల్లోనే జ‌రిగేవి. ఆయ‌న ఉప రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోవ‌డంతో కేంద్ర మంత్రి ప‌ద‌వి ఖాళీ అయ్యింది. ఇక్క‌డ చంద్ర‌బాబును ధీటుగా ఎదుర్కొనే వ్య‌క్తి కోసం బీజేపీ జాతీయ అధిష్టానం వెతుకుతోంది.

ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి అయితే చంద్ర‌బాబును ధీటుగా ఎదుర్కొంటార‌న్న అంచ‌నాకు బీజేపీ వ‌చ్చింది. పురందేశ్వ‌రి ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు అయినా, కేంద్ర మంత్రి అయినా చంద్ర‌బాబుకు చిక్కులు త‌ప్ప‌వు. ఈ క్ర‌మంలోనే పురందేశ్వ‌రిని రాజ‌కీయంగా అణ‌గొదొక్కే వ్యూహం అమ‌లు చేస్తున్నారా ? అంటే ప్ర‌స్తుత ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి.

పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించాలని ఒక దశలో బీజేపీ అగ్రనేతలు డిసైడ్ అయ్యారని సమాచారం. అయితే దీనికి కేంద్ర మాజీ మంత్రి వెంకయ్య కారణంగా బ్రేకులు పడ్డాయని కొందరు అంటున్నారు. పురందేశ్వ‌రి గ‌త మూడేళ్ల‌లో చంద్ర‌బాబును చాలాసార్లు టార్గెట్ చేశారు. అమరావతి – ఏపీలో అవినీతి – పోలవరం వంటి అంశాలపై ఆమె త‌న వాద‌న గట్టిగానే వినిపించారు. ఇది చంద్ర‌బాబుకు చాలా ఇబ్బందిగా మారింది.

వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల్లో ఆమె విశాఖ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అక్క‌డ బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలుస్తుంద‌ని భావించిన చంద్ర‌బాబు ఆమెను వ్యూహాత్మ‌కంగా రాజంపేట‌కు పంపించారు. అక్క‌డ వైసీపీ బ‌లంగా ఉండ‌డంతో ఆమె ఓట‌మి పాల‌వ్వ‌క త‌ప్ప‌లేదు. ఇప్పుడు చంద్ర‌బాబు వెంక‌య్య ద్వారా ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఆమెకు అప్ప‌గించ‌కుండా ఉండేలా ఇత‌ర వ్య‌క్తుల పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చేలా చేయ‌డంతో పాటు ఆమెకు కేంద్ర మంత్రి ప‌ద‌వి సైతం రాకుండా వ్యూహాత్మ‌కంగానే విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబును తెర‌మీద‌కు తెస్తున్న‌ట్టు స‌మాచారం. వెంక‌య్య వ్యూహం వెన‌క ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉన్నార‌న్న‌ది వేరే చెప్ప‌క్క‌ర్లేదని కూడా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌.