ఏపీ పాలిటిక్స్‌లో సీన్ రివ‌ర్స్‌

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. పార్టీ బ‌లోపేతం కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు నిన్న‌టి వ‌ర‌కు విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌ను వ‌రుస‌పెట్టి సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీ బండి ఓవర్ లోడ్ అయ్యింది. వైసీపీ నుంచి వ‌చ్చిన కొత్త నాయ‌కుల‌కు అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న పాత నాయ‌కుల‌కు మ‌ధ్య కూల్‌వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. దీంతో కొత్త నాయ‌కుల‌తో పొస‌గ‌ని పాత నాయ‌కులు ఇప్పుడు రివ‌ర్స్ జంప్ చేస్తున్నారు. వారంతా టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ గూటికి జంప్ చేస్తున్నారు. దీంతో నిన్న‌టి వ‌ర‌కు విప‌క్షం టు అధికార‌ప‌క్షంలోకి జంపింగ్‌గా ఉన్న రాజ‌కీయం ఇప్పుడు రివ‌ర్స్ అయ్యింది.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన శిల్పా మోహ‌న్‌రెడ్డి నంద్యాల‌లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. ఇక్క‌డ గెలిచిన భూమా నాగిరెడ్డి త‌న ఫ్యామిలీతో స‌హా టీడీపీలో చేర‌డంతో ఇప్పుడు శిల్పాకు ఇక్క‌డ ఫ్యూచ‌ర్ లేకుండా పోయింది. దీంతో శిల్పా ఇప్పుడు త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరుతున్నారు.

ఇప్పుడు టీడీపీకి ఇలాంటి ప‌రిస్థితి ఒక్క నంద్యాల‌లోనే కాదు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకున్న అన్ని చోట్లా కంటిన్యూ అయ్యే ప్ర‌మాదం ఉంది. క‌ర్నూలులో ఆళ్ల‌గ‌డ్డ‌తో పాటు ప‌క్క‌నే ఉన్న క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులోను ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. అక్క‌డ మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి రేపో మాపో ఎప్పుడైనా వైసీపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

వైకాపా నుంచి ఎమ్మెల్యేల‌ను తీసుకు వ‌స్తే చాలు పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని లెక్క‌లు వేసుకున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యి దిమ్మ‌తిరిగే షాక్ త‌గులుతోంది. రేపో మాపో వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా మంది కీల‌క నాయ‌కులు వైసీపీలోకి వెళ్లేందుకు అప్పుడే చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఏదేమైనా నిన్న‌టి వ‌ర‌కు ఒక‌లా వెళ్లిన ఏపీ రాజ‌కీయం ఇప్పుడు రివ‌ర్స్ అయ్యి మ‌రోలా వెళుతోంది.