టీవీ ప్రీమియ‌ర్ల‌లో ‘ బాహుబ‌లి 2 ‘ అదిరిపోయే రికార్డు

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిని బాహుబలి 2 సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1975 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. బాలీవుడ్‌కు సైతం దిమ్మ‌తిరిగిపోయేలా చేసిన బాహుబలి 2 ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే అదిరిపోయే బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. వెండితెర‌పై క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ సినిమా ఆదివారం టీవీల్లో ప్రీమియ‌ర్ల రూపంలో ఫ‌స్ట్ టైం ప్ర‌సారం అవుతోంది.

టీవీల్లో ప్ర‌సారం అవకుండానే బాహుబ‌లి 2 త‌న ఖాతాలో అదిరిపోయే రికార్డు వేసుకుంది. ఈ విజువ‌ల్ వండ‌ర్ ఈ రోజు ఏకంగా మూడు భాష‌ల్లో బుల్లితెర‌మీద ప్ర‌సారం అవుతోంది. ముందుగా మధ్యాహ్నం ఒంటిగంటకు సోనీ మ్యాక్స్ లో హిందీ వెర్షన్, తర్వాత విజయ్ టెలివిజన్ లో 3 గంటలకు తమిళ వెర్షన్, చివరగా స్టార్ మాలో సాయంత్రం 5 గంటలకు తెలుగు వెర్ష‌న్ ప్ర‌సారం కానుంది.

ఇక రిలీజ్‌కు ముందే కోట్లాది రూపాయ‌ల శాటిలైట్ బిజినెస్ చేసిన ఈ సినిమా ద్వారా ఈ రోజు భారీ టీఆర్పీ రేటింగ్స్ ఉంటాయ‌ని స‌ద‌రు ఛానెల్స్ యాజ‌మాన్యాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో ఇండియ‌న్ స్టార్‌గా మారిపోయిన ప్ర‌భాస్‌కు దేశ‌వ్యాప్తంగా అన్ని భాషల్లోను సూప‌ర్ క్రేజ్ ఉంది. మ‌రి వెండితెర‌పై ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే తిరుగులేని రికార్డులు కొల్ల‌గొట్టిన బాహుబ‌లి 2 బుల్లితెర‌పై ఏ రేంజ్‌లో టీఆర్పీలు కొల్లగొడుతుందో ? చూడాలి.