బాహుబ‌లి ప్రీమియ‌ర్ క‌లెక్ష‌న్లు

అనుకున్న‌దే జ‌రిగింది! తెలుగు మూవీ చ‌రిత్ర‌ను జ‌క్క‌న్న తిర‌గ‌రాశాడు! క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో బాహుబ‌లి ది కంక్లూజ‌న్‌కి క‌లెక్ష‌న్ల సునామీ ప్రారంభ‌మైంది. దాదాపు ఏడాదిన్న‌ర‌కు పైగా ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాకుండా టోట‌ల్ ప్ర‌పంచ ప్రేక్ష‌కుల‌ను సైతం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూసేలా చేసిన‌.. జ‌క్క‌న్న‌.. బాహుబ‌లి-2 శుక్ర‌వారం నుంచి ధియేట‌ర్ల‌లో రాజ్య‌మేలుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేలా మొత్తంగా తొమ్మిది వేల ధియేట‌ర్ల‌లో జ‌క్క‌న్న మ్యాజిక్ మూవీ బాహుబ‌లి సంద‌డి ప్రారంభ‌మైంది!!

అమ‌రేంద్ర బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు?- ఈ ప్ర‌శ్నే ఈమూవీపై అంతులేని అంచ‌నాల‌ను పెంచేసింది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా బాహుబ‌లి-2 కోసం జ‌నాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు. చూసిన స‌మ‌యం రానే వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి ధియేట‌ర్ల‌లో సంద‌డి ప్రారంభ‌మైంది! ఇది ఒక కోణం మాత్ర‌మే. ఇక క‌లెక్ష‌న్ల విష‌యానికి వ‌స్తే.. టాలీవుడ్‌, బాలీవుడ్ ల రికార్డుల‌ను జ‌క్క‌న్న మూవీ చెరిపేసింద‌నేది మ‌రో టాక్‌. ఎవ‌రికీ అంద‌ని అంచ‌నాల‌ను ఈ మూవీ దాటేసింద‌ని టాక్ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యంగా మెగా స్టార్ మూవీ ఖైదీ రికార్డు క‌లెక్ష‌న్ల‌ను సైతం బాహుబ‌లి-2 దాటేసింద‌నేది మ‌రో రికార్డు. అమెరికాలో ఖైదీ నెంబర్ 150 సినిమా 2.45 మిలియన్ డాలర్లు (15 కోట్ల 70 లక్షల రూపాయలు) కలెక్ట్ చేసింది. అయితే బాహుబలి-2 సినిమా అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ద్వారా ఏకంగా 3 మిలియన్ డాలర్లను (దాదాపు 19 కోట్ల రూపాయలు) కలెక్ట్ చేసిందని అక్కడ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది. అమెరికాలో గంటకు 64 లక్షల రూపాయల విలువ చేసే టికెట్స్ బుక్ అవుతున్నాయనీ తెలిపారు.

గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో అమెరికాలో బాహుబలి-2 విడుదల కాబోతుండటంతో ఈ కలెక్షన్లు మరింతగా దూసుకెళ్లే అవకాశం ఉంది. అమెరికా మొత్తం మీద విడుదలవుతున్న అన్ని భాషల్లో కలిపి 1100 స్క్రీన్లలో బాహుబలి-2 సందడి చేయనుంది. ఇక‌, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్క‌డ చూసినా ఈ మూవీ పోస్ట‌ర్లే క‌నిపిస్తున్నాయి. ఏ ఇద్ద‌రు క‌లిసినా జ‌క్క‌న్న మూవీ గురించే మాట్లాడుతున్నారు. ప్ర‌స్తుతం స్కూళ్ల‌కు సెల‌వులు కూడా కావ‌డంతో ఈ మూవీ రేంజ్ మ‌రింత‌గా పెరిగే ఛాన్స్ క‌నిపిస్తోంది. సో.. బాహుబ‌లి-2 మ‌రో ప్ర‌పంచ రికార్డుగా మారినా ఆశ్చ‌ర్యం లేదు.