బాహుబలి-2 TJ రివ్యూ

రేటింగ్ : 4/5
పంచ్ లైన్ : బాక్స్ ఆఫీస్ “భళిరా”

సినిమా : బాహుబ‌లి – ది కంక్లూజ‌న్
నటీనటులు : ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాసర్, సత్యరాజ్, సుబ్బరాజు తదితరులు.
స్టోరీ : వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌
డైలాగ్స్‌ : సీహెచ్‌.విజ‌య్‌కుమార్ – జి.అజ‌య్‌కుమార్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌ : ర‌మా రాజ‌మౌళి – ప్ర‌శాంత్ త్రిపుర‌నేని
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : సాబు సిరిల్‌
వీఎఫ్ఎక్స్‌ : క‌మ‌ల్ క‌ణ్ణ‌న్‌
ఫైట్స్‌ : కింగ్ సోల్మ‌న్ – లీ విట్టాక‌ర్ – కేచ‌.కంపక్తీ
డ్యాన్స్‌ : ప్రేమ్ ర‌క్షిత్ – శంక‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ : కెకె.సెంథిల్‌కుమార్‌
మ్యూజిక్‌ : ఎంఎం.కీర‌వాణి
ఎడిటింగ్‌ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాత‌లు : శోభు యార్ల‌గ‌డ్డ – ప్ర‌సాద్ దేవినేని
స్క్రీన్ ప్లే – ద‌ర్శ‌క‌త్వం : ఎస్ఎస్‌.రాజ‌మౌళి

ప్రపంచ వ్యాప్తంగా 9 వేలకు పైగా స్క్రీన్ లు 1000 కోట్లకు పైగా కలెక్షన్ అంచనాలు…ఇండియన్ సినిమా స్టామినా…తెలుగోడి సత్తా ఇలా ఎన్నో కరతాళ ధ్వనులు..జయ జయ ద్వానాల మధ్య బాహుబలి-2 విడుదల. విడుదలకుముందు ఈ సినిమా విజయం పై ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు లేవు కానీ సగటు సినీ ప్రేక్షకుడి మదిలో ఎక్కడో ఎదో చిన్న గుబులు..అంచనాల్ని అందుకుంటాడా మన తెలుగోడు అని..అందుకోవడమే కాదు..అందుకుని..లొంగదీసి..సవారి చేసేసాడు అన్ని అంచనాల్ని మన బాహుబలి.

సినిమా ఆద్యంత ఒక దృశ్య కావ్యం.ఇది ఒక క్లాసిక్ ఐ ఫీస్ట్.సాధారణ హాలీవుడ్ సినిమాలు తీస్తూ..ఆ సౌకర్యాలు ఆ బుడ్జెట్స్ ఆ సాంకేతిక నిపుణుల మధ్య ఇలాంటి సినిమాలు రావడం కొత్త కాదేమో కానీ..మన నేటివిటీలో పుట్టి పెరిగి అరకొర సాంకేతిక నిపుణులతో నెగ్గుకొస్తున్న మన తెలుగు సినిమా హాలీవుడ్ కె సవాల్ విసిరే స్థాయికి చేరిందంటే అది మామూలు విషయం కాదు.ఎవరో అరువుకు తెచ్చుకున్న హాలీవుడ్ సాంకేతిక నిపుణులో..లేక VFX నేర్పరులు వల్లనో ఇది సాధ్యం కాదు..ఓ దర్శకుడి కల..తపస్సు..కష్టం..అన్ని కలిస్తేనే బాహుబలి దృశ్యకావ్యమై మనముందు నిలిచింది.

బాహుబలి సినిమా కథ ఇది అని రివ్యూ లో రివీల్ చెయ్యడానికి మనసొప్పడం లేదు.ఏ కథ కోసమయితే దాదాపు రెండేళ్లకు పైగా సమయంపట్టినా ప్రేక్షకులు పోటెత్తుతున్నారో ..ఏ సస్పెన్స్ అందరిలోనూ ఒకటే ఉత్కంఠ రేకెత్తించిందో అది తెలుసుకుని సినిమాకెళ్ళడం ఆ ఫీల్ ని చంపేస్తుందని నా భావన.అందుకే కథ జోలికి వెళ్లడం లేదు.

సినిమా ఓపెనింగ్ టైటిల్స్ రోల్ అవ్వడం..ఆ బాక్గ్రౌండ్ లో మొదటిభాగం తాలూకు ముఖ్య మైన సన్నివేశాల్ని ఫ్రీజ్ చేసి చూపించడం రాజమౌళి సృజనకు హాట్స్ ఆఫ్ అనాల్సిందే.ఆ బిగినింగ్ చెప్తుంది చూడబోతున్న దాదాపు మూడుగంటల దృశ్య కావ్యం ఎంత అద్భుతంగా వుండబోతోదో అన్నది.ఓవరాల్ గా ఇది మనకేం తెలియని కథ కాదు.ఎన్నో పురాణాల్లో,రాచరికాల్లో మనం విన్న కథే.అయితే దానికి రాజమౌళి రాసిన స్క్రీన్ ప్లే ఎక్స్ట్రార్డినరీ.రెండో పార్ట్ చూసాక అసలు సినిమా శివుడి దగ్గరనుండి మొదలు పెట్టి చెప్పాలన్న థాట్ కి హాట్స్ ఆఫ్.

రాజమౌళి భాషలో సినిమా ఎలా ఉండాలంటే ప్రతి పది నిమిషాలకొకసారి సినిమా అమాంతం అలా లెయ్యాలి.ప్రేక్షకుడు ఉర్రుతలూగాలి.ఆ లెక్కకు అతికినట్టుగా బేరీజువేసి మరీ తీసేసాడు ఈ బాహుబలిని.ఆహ్లాదం..అద్భుతం..అదరహో ఇలా ఒకదాని తరువాత ఒక సీన్ ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తాయి.ఒక చిన్న ఉదాహరణ..ఆడదాని మీద చెయ్యేస్తూన్నాడని ఒకడి చెయ్యి నరికేస్తుంది దేవసేన.ఆమె పై విచారణ జరుగుతోండగా..ఆడదాని మీద చెయ్యేస్తే నరకాల్సింది చెయ్యి కాదు అని బాహుబలి అనగానే నరకాల్సింది తల అనే డైలాగ్ ఎక్సపెక్ట్ చేస్తారు ఎవరైనా…నరకాల్సింది తల అనడం తల నరకడం రెండూ ఒకే సారి జరిగిపోవడమ్ సినిమా ఇంటెన్సిటీ ఏ రేంజ్ కి తీసుకెళ్లాడో అర్థం అవుతుంది.

బాహుబలి ప్రభాస్ ఐదేళ్ల కష్టం వూరికే పోలేదు..ప్రాణం పోసాడు బాహుబలికి ప్రభాస్ తన నటనతో.భల్లాల దేవగా రానా కటౌట్ పర్ఫెక్ట్ గా వుంది కానీ విల్లన్ లోని ఆ కన్నింగ్ నెస్..ఆ క్రుయాలిటీ ఎందుకనో రానాలో అంత బాగా పలకలేదనిపించాయి.ఇక ఈ రెండో భాగానికి హై లైట్ సుబ్బా రాజు పాత్ర..జీవితాంతం సుబ్బరాజుకు గుర్తుంది పోయే పాత్ర.ప్రేక్షకులపై కూడా విపరీత ప్రభావం చూపిన పాత్ర.సుబ్బా రాజే చెయ్యాలనిపించాడు ఆ పాత్రని.ఇక అనుష్క ఈ రెండో భాగం లో తానేంటో తానెందుకు అందరికంటే ప్రత్యేకమో మరోసారి నిరూపించింది.ఇక కట్టప్ప,బిజ్జలదేవ,శివగామి అందరూ మొదటి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా నటించారు.

సాంకేతికంగా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఇంత స్టాండర్డ్స్ తో సినిమా రాలేదేమో.VFX అయితే పీక్స్.సినిమా మొత్తానికి ఒకటి రెండు చోట్ల తప్ప(ఎద్దులపై ప్రభాస్ పరిగెత్తడం లాంటివి) సింప్లి అవుట్ స్టాండింగ్.కెమెరామెన్ సెంథిల్ వర్క్ సూపర్బ్.కలర్ మిక్సింగ్,ఆర్ట్ వర్క్,ఫైట్స్,మ్యూజిక్,బాక్గ్రౌండ్ స్కోర్ ఇలా టెక్నికల్ అంశాలన్నీ సరికొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేసేసారు ఈ సినిమాతో.

ఎంత పాజిటివ్ రివ్యూ రాస్తున్న క్రిటిక్ గా చూస్తే సినిమా మొదటి రెండుగంటలూ అద్భుతం..ఒక్క సారి కట్టప్ప బాహుబలిని బలి తీసుకున్న తరువాత స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్ అయిపొయింది.క్లైమాక్స్ తెలిసిపోతూనే ఉంటుంది.అక్కడ సినిమా కాస్త పట్టు సడలినట్టనిపిస్తుంది.క్లైమాక్స్ ఫైట్ అంత ఎఫక్టీవ్ గా రాలేదనిపించింది.క్లైమాక్స్ కి కావాల్సిన ఎమోషన్స్ వున్నా అంత పర్ఫెక్ట్ గా మెటీరియలైజ్ చెయ్యలేదేమో అనిపిస్తుంది.మొదటి పార్ట్ లో కాలకేయులు ఫైట్ సినిమాకు ఊపిరి. దాంతో పిలిస్తే ఈ రెండో భాగం క్లైమాక్స్ తేలిపోయిందనిపిస్తుంది.అది మినహా సినిమా గురించి విమర్శకులకు చెప్పడానికి ఏమి లేదు.

రివ్యూ లో రాయడానికి ఎంతో వున్నా సినిమా మొత్తం మాటల్లో రివ్యూ రూపం లో ప్రేక్షకులకి చేరవేయడం ఇష్టపడడం లేదు.అందుకే సాద్యమైనంత సంక్షిప్తంగా సినిమా రివ్యూ రాసి మిగిలింది స్వయానా థియేటర్స్ లో చూసి ఆస్వాదిస్తేనే ఆ ఐ ఫీస్ట్ అని నమ్ముతున్నాను.