మాట త‌ప్పిన బాల‌య్య‌

ఇటీవల కాలంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ‌.. విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. అటు సినిమాలు ఇటు రాజ‌కీయాల‌ను బ్యాలెన్స్ చేస్తున్న ఆయ‌న‌కు.. ఇప్పుడు కొంత గ‌డ్డు కాలం ఎదుర‌వుతోంది. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క‌మైన హంద్రీనీవా ప్రాజెక్టు విష‌యంలో మరోసారి ఆయ‌న‌ పేరు వినిపిస్తోంది. దీనిని రెండేళ్ల‌లో పూర్తిచేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చాడు బాల‌య్య! కానీ ఈ మాట‌లు నిజ‌మ‌య్యేలా మాత్రం క‌నిపించ‌డం లేదు. తొలినాళ్ల‌లో పూర్తి శ్ర‌ద్ధ వ‌హించిన బాల‌కృష్ణ‌.. ఇప్పుడు ప‌నుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యంలో మాట త‌ప్పాడ‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. ప‌నుల‌పై ఇప్ప‌టికైనా శ్ర‌ద్ధ పెట్టాల‌ని కోరుతున్నారు.

మడకశిర ఉప కాలువ పనులు పూర్తయితే హిందూపురం – మడకశిర ప్రాంతాల్లో తాగు, సాగునీటికి కరువుండదు. 2007-08 మధ్య వీటిని ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వేగవంతమయ్యాయి. ఇటీవల జిల్లాకు పలుమార్లు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవాపైనే సమీక్షలు చేసి, పనులు పరుగెత్తే విధంగా చర్యలు చేపట్టారు. మడకశిర ఉపకాలువలో అంతర్భాగమైన గొల్లపల్లికి నీరు రావడంతో హిందూపురం-మడకశిర ప్రాంతాలకు కూడా అందుతుందని ప్రజలు ఆశించారు. పనులు వేగవంతంగా సాగుతున్నా.. కాలువ నిర్మాణంలో రైల్వే, అటవీ, భూసమస్యలు పరిష్కరించాల్సి ఉంది. ఆగస్టు నెలాఖరుకు పనులు పూర్తయి, నీరు వస్తుందా అన్న సందేహాలు వెంటాడుతున్నాయి.

ముఖ్యమంత్రి ఎన్ని సమీక్షలు చేస్తున్నా.. పనులు చేపట్టడంలో కొందరు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మడకశిర ఉప కాలువకు సంబంధిచి ప్రధానంగా రోడ్లు, రైల్వే, అటవీ, నదీ ప్రాంతాల్లో పనులు చేపట్టాల్సి ఉంది. పెనుకొండ మండలం కుంభకర్ణ ప్రాజెక్టు వద్ద 60 అడుగుల లిఫ్టు సొరంగం, సోమందేపల్లి మండలం రంగేపల్లి – చాకర్లపల్లి వద్ద భూగర్భంలో 80 అడుగుల లోతున కాలువ పనులు ప్రారంభించాల్సి ఉంది. హిందూపురం మండలంలో కొడిపి వద్ద రైల్వే ట్రాక్‌ కింద, పెన్నా, జయమంగళి నదులపై అక్విడెక్ట్‌లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులను ఇప్పటికిప్పుడు ప్రారంభించినా.. పూర్తవడానికి కనీసం మూడు నెలలు పడుతుందని అధికార వర్గాలు అంటున్నాయి.

విద్యుత్‌ సబ్‌స్టేషన్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు పూర్తి కావాలంటే మరి కొంత సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. దీనిని బ ట్టి చూస్తే.. ఆగస్టు ఆఖరుకు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ గడువు పొడిగింపు తగ్గదని రైతులు భావిస్తున్నారు. హిందూపురంలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.. మడకశిర ఉపకాలువ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, ఆగస్టు ఆఖరులోగా నీరు పారేలా చర్యలు తీసుకోవాలని హిందూపురం, మడకశిర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.