అల్లుడు కోసం మామ త్యాగమా..! లేక గుడ్ బై నా..!

ప్ర‌ముఖ సినీన‌టుడు, ఏపీలోని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న హిందూపురం నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ? బాల‌య్య 2019 త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది.

2014 ఎన్నిక‌ల్లో త‌న తండ్రి గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన హిందూపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య తొలి మూడేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టించారు. త‌ర్వాత బాల‌య్య ఏపీ శేఖ‌ర్ వ్య‌వ‌హార శైలీపై నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో అసంతృప్తి భ‌గ్గుమ‌న‌డం, బాల‌య్య సినిమాల్లో బిజీ అయ్యి నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అక్క‌డ బాల‌య్య‌పై ఇటీవ‌ల అసంతృప్తి బాగా ఎక్కువైంది.

బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం వెన‌క మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో విసిగిపోయిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌ని డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. ఇక హిందూపురం నుంచి బాల‌య్య అల్లుడు, మంత్రి నారా లోకేశ్ పోటీ చేసేలా చంద్ర‌బాబు ప్లాన్ చేసిన‌ట్టు టీడీపీ ఇంట‌ర్న‌ల్ టాక్‌.

అలాగే మ‌రో క‌థ‌నం కూడా ఇక్క‌డ వినిపిస్తోంది. లోకేశ్‌కు ఓ మంచి నియోజ‌క‌వ‌ర్గం ఉండేలా ప్లాన్ చేసిన చంద్ర‌బాబు బాల‌య్య‌ను వ్యూహాత్మ‌కంగా రాజ్య‌స‌భ‌కు పంపి లోకేశ్‌ను హిందూపురం బ‌రిలో దింపాల‌ని భావిస్తున్నార‌ట‌. అదే జ‌రిగితే ఏపీ కేబినెట్‌లో బాల‌య్య మంత్రి కావాల‌ని కూడా అడ‌గే ఛాన్స్ ఉండ‌దు.

మ‌రి బాల‌య్య మ‌దిలో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పాల‌ని ఉన్నా లేదా త‌న‌యుడు లోకేశ్ కోసం ఇది చంద్ర‌బాబు వేసిన స్కెచ్ అయినా లోకేశ్ కోసం బాల‌య్య పెద్ద త్యాగ‌మే చేసిన‌ట్టు అనుకోవాలి. ఇక హిందూపురంను వ‌దులుకోవాల‌న్న ఆలోచ‌న‌తోనే ఉన్న బాల‌య్య సైతం ఇక్క‌డ పెద్ద‌గా కాన్‌సంట్రేష‌న్ చేయ‌ట్లేద‌నే గుస‌గుస‌లు అటు అనంత జిల్లాలోను ఇటు టీడీపీలోను వినిపిస్తున్నాయి.