బాల‌య్యా ఏంద‌య్యా ఈ కంగాళీ రాజ‌కీయం

నంద‌మూరి బాల‌య్య సీఎం చంద్ర‌బాబు వియ్యంకుడుగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న వ్య‌వ‌హార శైలి పూర్తిగా గాడిత‌ప్పింద‌ని, త‌మ‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని హిందూపురం జ‌నాలు భారీ ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 2014లో ప‌ట్టుబ‌ట్టి హిందూపురం నుంచి గెలిచిన బాల‌య్య త‌ర్వాత ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని గాలికొదిలి.. మ‌ళ్లీ సినిమాల్లో మునిగితేలుతున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారాయి. అంతేకాదు, ఎప్పుడైనా అడ‌పా ద‌డ‌పా నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చినా కూడా.. ప్ర‌జ‌ల గోడును ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా సోమ‌వారం బాల‌య్య త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి ప్రారంభోత్స‌వాలు చేశారు. ఈ క్ర‌మంలోనే ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు బాల‌య్యను క‌ల‌వాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ, ఆయ‌న దురుసుగా వెళ్లిపోవ‌డంతో స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘‘బాలకృష్ణ డౌన్‌.. డౌన్‌.. మా సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి’’ అంటూ నినాదాలు చేశారు. సి.వెంకటాపురం, ఓబుళాపురం, గలిబిపల్లి గ్రామాల్లో రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. సీసీ రోడ్లు కూడా లేకపోవడంతో వానా కాలం అడుగుతీసి అడుగు వేయాలంటేనే ఇబ్బందిగా మారింది.

ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత హిందూపురం వస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు తమ సమస్యలు విన్నవించుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. బాలకృష్ణ వాహనం బిసల మానేపల్లికి చేరుకోగానే వెంకటాపురం, ఓబుళాపురం, బిసల మానేపల్లి గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. బిసలమానేల్లి నుంచి వెంటాపురం, ఓబుళాపురం గ్రామాలకు రహదారి లేదన్న విషయం చెప్పాలని భావించారు.

కానీ బాలకృష్ణ వారితో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లి పోయారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యే వైఖరిని నిరసనగా రాస్తారోకో చేశారు. కాగా, బాల‌య్య వ్య‌వ‌హారంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అటు న‌ట‌న‌, ఇటు అధికారం కావాలంటే ఎలా బ‌ల‌య్యా? అని ప్ర‌శ్నిస్తున్నారు. పూర్తిగా ఏదో ఒక ప‌డ‌వ‌ను ఎంచుకుని ప్ర‌శాంతంగా ప‌నిచేసుకోవ‌చ్చు క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు.