ప్లాన్ మార్చిన మామా, అల్లుడు

ఏపీలోని కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన కృష్ణా జిల్లా రాజకీయం ఈ సారి మరింత హాట్ హాట్ గా మారనుంది. ఇక్క‌డ ఏపీ రాజ‌ధాని ప్రాంతం ఏర్పాటు కావ‌డంతో గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇక్క‌డ రాజకీయం స‌రికొత్త‌గా పుంత‌లు తొక్క‌నుంది. కీల‌క‌మైన రాజధాని ప్రాంతంలో గెలిచేందుకు అన్ని పార్టీల‌కు మ‌హామ‌హులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌ధాని ప్రాంతంలో సీటు ద‌క్కించుకునేందుకు ప్ర‌ధాన పార్టీల నుంచి ప్ర‌ముఖులు పోటీ ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే అధికార టీడీపీలో మామా, అల్లుడుగా ఉన్న హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌, మంత్రి లోకేశ్ ఇద్ద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ చాలా రోజులుగా సేఫ్ సీటు కోసం అన్వేష‌ణ చేస్తున్నారు. సొంత జిల్లా చిత్తూరులోని సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరి లాంగ్‌ర‌న్‌లో అంత సేఫ్ కాద‌ని భావించిన లోకేశ్‌, చంద్ర‌బాబు చివ‌ర‌కు బాల‌య్య ప్రాథినిత్యం వ‌హిస్తోన్న హిందూపురంపై క‌న్నేశారు.

అయితే లోకేశ్ కృష్ణా జిల్లా నుంచే ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంద‌ని భావించిన బాబు ఆయ‌న్ను పెన‌మ‌లూరు నుంచి పోటీ చేయించాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అప్పుడు ఏమైనా మార్పులు ఉండొచ్చు కానీ..లేదంటే పెనమలూరు నుంచే లోకేశ్ పోటీ చేయ‌డం దాదాపు క‌న్‌ఫార్మే అంటున్నారు.

ఇక బాల‌య్య‌కు ప్ర‌స్తుతం హిందూపురంలో అంత పాజిటివ్ అయితే లేదు. ఆయన నియోజ‌క‌వ‌ర్గానికి గుర్తొచ్చిన‌ప్పుడే వ‌స్తున్నారు. దీంతో ఇటీవ‌ల ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త ప్రారంభ‌మై చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి కాకుండా కృష్ణా జిల్లాలోని గుడివాడ నుంచి బ‌రిలో ఉంటార‌ని తెలుస్తోంది. బాల‌య్య‌ను గుడివాడ నుంచి పోటీ చేయించ‌డం ద్వారా త‌న‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన కొడాలి నానికి చెక్ పెట్టాల‌న్న‌దే బాబు ప్లాన్‌గా తెలుస్తోంది.

ఇక బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి పేరు విజ‌య‌వాడ లేదా గుంటూరు లోక్‌స‌భ‌కు వినిపిస్తోంది. బాబు, లోకేశ్‌, బాల‌య్య వీళ్లంతా రాష్ట్ర రాజ‌కీయాల్లోనే ఉంటున్నారు. బ్రాహ్మ‌ణిని అలా కాకుండా లోక్‌స‌భకు పంపితే కేంద్రంలో వ్య‌వ‌హారాలు ఆమె చ‌క్క‌పెడుతుంద‌ని బాబు భావిస్తున్నారు. ఏదేమైనా మామ‌, అల్లుడు ఎంట్రీతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కృష్ణా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి.