బాబుకు బాల‌య్య షాక్‌: హిందూపురంకు గుడ్‌బై

ప్రముఖ సినీన‌టుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ రాజ‌కీయంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్నాడా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దులుకోనున్నాడా ? బాల‌య్య ఇప్ప‌టికే తీసుకున్న ఈ డెసిష‌న్‌తో చంద్ర‌బాబు సైతం షాక్ అయ్యారా ? అంటే ఏపీ పొలిటిక‌ల్ కారిడాల్ ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఎన్టీఆర్ వార‌సుడిగా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా నాలుగు ద‌శాబ్దాలుగా రాణిస్తోన్న బాల‌య్య గ‌త ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా విజ‌యం సాధించి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి రెండేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిని బాల‌య్య ప‌రుగులెత్తించాడు. రాష్ట్ర మంత్రుల‌తో పాటు కేంద్ర మంత్రుల‌ను క‌లిసి నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి విష‌యంలో రాజీ ప‌డ‌లేదు. ఇక గ‌త యేడాది కాలంగా బాల‌య్య త‌న వందో సినిమా శాత‌క‌ర్ణితో పాటు ఆ త‌ర్వాత ప్రస్తుతం పూరి జ‌గ‌న్నాథ్ సినిమా షూటింగుల‌తో బిజీ బిజీ అయ్యాడు.

దీంతో హిందూపురంలో బాల‌య్య క‌న‌ప‌డ‌డం లేదంటూ అక్క‌డ ప్ర‌జ‌లు వివిధ రూపాల్లో ఆందోళ‌న‌కు దిగుతున్నారు. బాల‌య్య హిందూపురంలో నియ‌మించిన శేఖ‌ర్ అనే వ్య‌క్తి వ‌ల్ల ఆయ‌న‌కు లేనిపోని చెడ్డ‌పేరు వ‌చ్చింది. అక్క‌డ శేఖ‌ర్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో త‌ప్పించి ఆ ప్లేస్‌లో మ‌రో వ్య‌క్తిని బాల‌య్య పీఏగా అపాయింట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం హిందూపురంలో అధికార టీడీపీ నాయ‌కుల్లోను, అధికారుల్లోను స్త‌బ్ద‌త ఏర్ప‌డింది.

ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాల‌య్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌న‌ని చెప్పేశార‌ట‌. తాను హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌న‌ని, త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని చంద్ర‌బాబు వ‌ద్ద త‌న మ‌న‌స్సులో మాట బ‌య‌ట‌పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి బాల‌య్య ప్ర‌తిపాద‌న‌కు చంద్ర‌బాబు ఓకే చెప్పారో ? లేదో ? తెలియ‌దు కాని ఆయ‌న ఈ ప్ర‌తిపాద‌న విన్న‌వెంట‌నే షాక్‌కు గుర‌య్యార‌న్న గుస‌గుస‌లు టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌ల ప‌ర్వం ఎక్కువుగా ఉండ‌డంతో పాటు ఓ నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమిత‌మై చేసేదేమి ఉండ‌ద‌న్న ఆలోచ‌న‌తోనే బాల‌య్య రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌ని డిసైడ్ అయ్యార‌ట. బాల‌య్య‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి పార్టీ అధికారంలోకి వ‌చ్చినా మంత్రి ప‌ద‌వి క‌ష్ట‌మే. ఇప్ప‌టికే చంద్ర‌బాబు, లోకేశ్ మంత్రులుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య హిందూపూరంకు ప‌రిమిత‌మ‌వ్వ‌డం కంటే రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌ని దాదాపు ఫిక్స్ అయ్యార‌ని టాక్‌.