బాలయ్య చూపు ఆ జిల్లా పైనా!

దివంగత ఎన్టీరామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట‌. టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఇక్క‌డ ఆ పార్టీ ఓడిపోలేదు. 2014 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్టీఆర్ వార‌సుడు బాల‌య్య ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బాల‌య్య ఇక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచినా గ‌తంలో త‌న తండ్రికి వ‌చ్చిన మెజార్టీ మాత్రం బాల‌య్య‌కు రాలేదు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రెండేళ్ల‌లో బాల‌య్య బాగానే అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. అయితే ఇటీవ‌ల ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో పీఏగా నియ‌మించిన శేఖ‌ర్ అవినీతి, అక్ర‌మాల‌తో నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ క్యాడ‌ర్ ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. చివ‌ర‌కు శేఖ‌ర్‌ను త‌ప్పించాల్సిందేన‌ని అక్క‌డ పెద్ద సంక్షోభం త‌లెత్త‌డంతో చివ‌ర‌కు చంద్ర‌బాబు జోక్యం చేసుకుని బాల‌య్య పీఏగా శేఖ‌ర్‌ను త‌ప్పించారు.

ఇదిలా ఉంటే బాల‌య్య ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు. నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డం, అక్క‌డ ప‌నులు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో బాల‌య్య‌పై ఇటీవ‌ల వ్య‌తిరేక‌త బాగా ఎక్కువైంది. బాల‌య్య ఇదే రూట్లో వెళితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుస్తారా ? అని ప్ర‌శ్నించుకుంటే డౌటే అన్న సందేహాలు సైతం వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా ఉంటే బాల‌య్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందూపురంకు గుడ్ బై చెపుతార‌న్న వార్త‌లు ఏపీ టీడీపీలో ఇంట‌ర్న‌ల్‌గా వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందూపురంలో పోటీ చేసేందుకు ఇష్టం లేని బాల‌య్య క‌న్ను కృష్ణా జిల్లా వైపు ఉన్న‌ట్టు టాక్‌. కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరుపై బాల‌య్య ఆస‌క్తిగా ఉన్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న హిందూపురంపై శీత‌క‌న్ను వేశార‌న్న చ‌ర్చ‌లు కూడా అనంత జిల్లాలో వినిపిస్తున్నాయి. మ‌రి బాల‌య్య మ‌రోసారి హిందూపురంలో గెల‌వాలంటే ఈ రెండేళ్ల‌లో శ‌క్తికి మించి క‌ష్ట‌ప‌డాల్సిందే.