బాల‌య్య వార్నింగ్‌: క‌లిసి ఉండండి.. లేదంటే వెళ్లిపోండి

ముక్కుసూటిగా మాట్లాడ‌టం, వ్య‌వ‌హ‌రించ‌డంలోనూ సినీన‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణకు ఎవ‌రూ సాటిరారు! సినిమాల్లో అయినా రాజ‌కీయాల్లో అయినా ఇదే పంథాను కొన‌సాగిస్తున్నారు! అటు సినిమాలు, ఇటు రాజ‌కీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వ‌స్తున్నాడు బాల‌య్య‌! కొంత కాలం నుంచి హిందూపురం నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు మ‌ళ్లీ రాజకీయాల‌పై దృష్టిసారించారు. వ‌స్తూ వ‌స్తూనే నియోజ‌క‌వ‌ర్గంలోని క్యాడ‌ర్ మ‌ధ్య‌ నెల‌కొన్న గ్రూప్ త‌గాదాలపై సీరియ‌స్ అయ్యాడు. ఉంటే క‌లిసి క‌ట్టుగా ఉండాల‌ని సూచించాడు! లేకుండే వెళ్లిపోవాల‌ని ఘాటుగా వార్నింగ్ కూడా ఇచ్చేశాడు! అంతేగాక `సీఎం` ప‌ద‌విపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

`పైసా వ‌సూల్‌` సినిమా హ‌డావుడిలో నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాల‌కు బాల‌య్య దూరంగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలోనే క్యాడ‌ర్‌లో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. గ్రూపు రాజ‌కీయాలు తెర‌పైకి వ‌చ్చాయి, వ‌ర్గ విభేదాలు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో బాల‌య్య హిందూపురం ప‌ర్య‌ట‌న అంద‌రిలోనూ ఆస‌క్తి క‌లిగించింది. హిందూపురం టీడీపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంపై బాలకృష్ణ సీరియస్ అయ్యారు. అందరూ కలసి పనిచేయాలని… లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలోని తన నివాసంలో పార్టీ నేతలతో బాలయ్య సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య గ్రూపు తగాదాలు మరోసారి బయటపడ్డాయి.

బాలయ్య ముందే నేతలు ఒకరిపై మరొకరు విమర్శలకు దిగారు. దీంతో, అందరూ తనతో పాటు కలసి పనిచేయాలని… లేకపోతే వెళ్లిపోవాలని బాల‌య్య‌ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రజల చెంతకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేర్చాలన్నదే తన తపన అని…నేతలంతా విభేదాలను మరిచి, తనతో పాటు కలసి పని చేయాలని సూచించారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చి, ఒకరి మండలాల్లో మరొకరు కలగజేసుకోవద్దని చెప్పారు. ఇదే స‌మ‌యంలో బాలకృష్ణ, సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం కావాలనో, మంత్రి కావాలనో ఎటువంటి ఆశలూ లేవని స్పష్టం చేశారు.

పెద్ద పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, తన తండ్రి పోటీ చేసి గెలిచిన హిందూపురాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని తెలిపారు. ఇక్కడున్న సమస్యల్లో కొన్ని తన దృష్టికి వచ్చాయని, ఇక్కడి ప్రజల ప్రతినిధిగా వాటిని పరిష్కరించడమే తన ముందున్న తొలి కర్తవ్యమని అన్నారు. ఆపై తెలుగుదేశం పార్టీకి అవసరమైన సేవలను అందిస్తానే తప్ప ముఖ్యమంత్రి పదవి పొందాలని ఎన్నడూ అనుకోనన్నారు.