న‌ంద్యాల క్లైమాక్స్‌లో టీడీపీకి చెంప దెబ్బ‌

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం క్లైమాక్స్‌లో టీడీపీకి అదిరిపోయే చెంప‌దెబ్బ త‌గిలింది. ఇక్క‌డ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రావ‌డానికి కొద్ది రోజుల ముందే చంద్ర‌బాబు నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న అధికారుల‌ను అంద‌రిని ట్రాన్స్‌ఫ‌ర్ చేసేసి త‌న‌కు అనుకూలంగా ఉండేవాళ్ల‌ను వేయించుకున్నారు. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీ, ఐజీ, డీఐజీ ఇలా అంద‌రిని బ‌దిలీ చేసేసి కొత్త‌వాళ్ల‌ను అక్క‌డ బాబు సెట్ చేశారు. ఉప ఎన్నిక వేళ నోటిఫికేష‌న్ వ‌స్తే తాను చెప్పిన‌ట్టు చేయాల‌ని, అధికార టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని వాళ్ల‌కు ముందే ఆదేశాలు వెళ్లిన‌ట్టు టాక్‌.

చంద్ర‌బాబు, ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కార‌మే జిల్లాలో పై స్థాయి నుంచి కింది స్థాయి పోలీసు అధికారులే కాదు, మిగిలిన అధికారులు కూడా నంద్యాల‌లో తెలుగుదేశాన్ని గెలిపించేందుకు త‌మ‌వంతు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నారు. ఇక ఇప్పుడు అక్క‌డ ఉప ఎన్నిక ప్ర‌చారం క్లైమాక్స్‌కు చేరుకుని ఎన్నిక మ‌రో నాలుగు రోజుల్లో జ‌ర‌గ‌నుంద‌న‌గా టీడీపీకి చెంప‌దెబ్బ‌లాంటి షాక్ త‌గిలింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

గోపాల‌కృష్ణ అధికార టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వైసీపీకి చెందిన చిన్నాచితకా నాయకుల ఇళ్లపై అర్థరాత్రి సోదాలు అంటూ తలుపు తడుతున్నారని ఆ పార్టీ నేతల నుంచి ఈసీకి ఫిర్యాదు వెళ్లింది. డీఎస్పీ ఏక‌ప‌క్ష తీరుపై వైసీపీ చేసిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది.

గోపాలకృష్ణ స్ధానంలో ఓఎస్‌డీ రవిప్రకాశ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముగ్గురు పరిశీకులను ఈసీ నియమించింది. ఒక ఉప ఎన్నికకు ఇంతమంది పరిశీలకును నియమించడం ప్రత్యేక సమయాల్లో మాత్రమే జరగుతుంటుంది. ఏదేమైనా ఉప ఎన్నిక వేళ డీఎస్పీ బ‌దిలీ వేటు టీడీపీకి బిగ్ షాక్‌లాంటిదే.