కేంద్ర‌మంత్రి డీల్‌తో పితానికి మంత్రి ప‌ద‌వి

ఏపీ క్యాబినెట్లో క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి త‌ప్ప‌కుండా అవ‌కాశం ద‌క్క‌తుంద‌ని భావించిన వారంతా సైడ్ అయిపోయారు. మ‌రికొంత‌మంది అనూహ్యంగా తెరపైకి వ‌చ్చారు. వీరిలో పితాని స‌త్య‌నారాయ‌ణ ఒక‌రు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం వెనుక కేంద్రమంత్రి చ‌క్రం తిప్పార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇందుకు భారీ ప్యాకేజీ కూడా ఆయ‌న అందుకున్నార‌ని అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్.. ఏకంగా సీఎం చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశార‌న్న వార్త చర్చ‌నీయాంశ‌మైంది. అంతేగాక ఆయన అనుచ‌ర‌లు ఆ కేంద్ర‌మంత్రిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నార‌ట‌.

మంత్రి ప‌ద‌వి ఆశించి తీవ్రంగా భంగ‌ప‌డిన వారిలో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కూడా ఉన్నారు. అంతేగాక ఆ అసంతృప్తిలోనే తాను అవ‌స‌ర‌మైతే వేరే పార్టీ పెడ‌తాన‌ని కూడా ప్ర‌క‌టించారు. త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు.. బుజ్జ‌గింపుల‌తో మ‌ళ్లీ మెత్త‌బ‌డ్డారు. అయితే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌న్న కోపం కన్నా.. త‌న‌పై అనేక అక్రమ కేసులు పెట్టించి, కార్యకర్తలను పోలీసులతో కొట్టించి జైలుపాలు చేసిన వ్యక్తికి ఇవ్వడంపై ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తన సామాజికవర్గాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించే ఆయ‌న‌కు మంత్రి ఇవ్వటం మింగుడుపడడం లేదు.

పితానికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం వెనుక గ‌ల ఆంత‌ర్య‌మేమిటో తెలుసుకునేందుకు సీఎం చంద్ర‌బాబును చింత‌మ‌నేని క‌లుసుకున్నార‌ట‌. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ హయాంలో అనేకసార్లు తన సామాజికవర్గంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఈ క్వేషన్లతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చిందని వివ‌రించారు. పితానికి మంత్రి పదవి ఇవ్వడం వెనుక కేంద్ర మంత్రి సుజనాచౌదరి భారీ మొత్తంలో ప్యాకేజీ వసూలు చేసుకున్నారని…జిల్లాలో ప్రచారం జరుగుతోందని చంద్ర‌బాబుకు వివ‌రించారు. అదంతా అభూత కల్పన అని, అటువంటిదేమీ లేద‌ని చంద్ర‌బాబు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

దీంతో చల్లబడిన చింతమనేని ‘సార్‌.. మీ ఇష్టం. మీకు ఎప్పుడూ నేను విధేయుడినే. నిన్న కాక మొన్నకూడా మంత్రి పితాని. న‌న్ను, నా కార్యకర్తలను, నా కులాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడారు. వీట‌న్నింటినీ మీ దృష్టికి తీసుకు వస్తాను. దీనిపై విచారణ జరిపించాల‌`ని సీఎం ను కోరార‌ట‌. అయితే పితానిలో ఇంకా కాంగ్రెస్ నెత్తురే ప్ర‌వ‌హిస్తోంద‌ని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పిలిచి పిల్లనివ్వడమే కాకుండా..ఖరీదైన కానుకలు ఇచ్చిన వ్యక్తిని పలు విధాలుగా అవమానించిన చందంగా పితాని వ్యవహారశైలి ఉందని టిడిపి ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు.