క‌ర్ణాట‌క‌లో బీహార్ ఫార్ములా: కాంగ్రెస్‌+జేడీఎస్ పొత్తు

బీజేపీకి దూకుడుకు బ్రేకులు వేసేందుకు క‌ర్ణాట‌క‌లో బీహార్ ఫార్ములా అమ‌లు కాబోతుందా ? ఎట్టి ప‌రిస్థితుల్లోను క‌ర్ణాట‌క‌లో కాషాయ జెండా ఎగ‌ర‌కుండా ఉండేందుకు… సెక్యులర్‌ ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ, జేడీ (ఎస్) పొత్తు పెట్టుకోనున్నాయా ? ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడనున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు.

ప్ర‌స్తుత క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఒక‌ప్పుడు మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవ‌గౌడ నేతృత్వంలోని జేడీఎస్‌లోనే ఉండేవారు. దేవ‌గౌడ‌తో తీవ్ర‌స్థాయిలో విబేధాలు రావ‌డంతో ఆయ‌న కాంగ్రెస్‌లో చేరి ముఖ్య‌మంత్రి అయ్యారు. ఇక ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో నంజన్‌గూడ్‌, గుండ్లుపేట్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో జేడీఎస్‌+కాంగ్రెస్ మ‌ధ్య అన‌ధికార ఒప్పందం జ‌రిగింద‌న్న టాక్ కూడా ఉంది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ తిరుగులేని విజ‌యం సాధించింది.

ఇక వ‌చ్చే యేడాది అక్క‌డ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెల‌వాలన్నా, బీజేపీ ఎదుర్కోవాల‌న్నా కాంగ్రెస్‌+జేడీఎస్ పొత్తే క‌రెక్ట్ అన్న నిర్ణ‌యానికి ఈ రెండు పార్టీలు వ‌చ్చాయ‌ట‌. బీహార్ లాలూ+నితీష్‌కుమార్ క‌లిసి బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించిన సంగ‌తి తెలిసిందే. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవాల‌ని కర్ణాట‌క కాంగ్రెస్‌పై బాగా ఒత్తిడి వ‌స్తోంద‌ట‌. ఇక విశ్లేష‌కుల అంచ‌నా ప్ర‌కారం కూడా కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీ (ఎస్‌) కలిస్తే బీజేపీ విజయం కష్టమని భావన వ్యక్తమవుతోంది.

గతేడాది మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సెక్యులర్ ఓట్లు చీలిపోవడం వల్ల కాంగ్రెస్‌ రెండు సిట్టింగ్‌ స్థానాలను కోల్పోయింది. బీదర్‌లో మాత్రం కాంగ్రెస్‌ గెలవగా, హెబ్బాల్‌, దేవదుర్గ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా జేడీఎస్ మూడో స్థానంలో నిలిచింది. అయినా ఆ పార్టీకి భారీ సంఖ్య‌లో ఓట్లు పోల‌య్యాయి. ఈ క్ర‌మంలో అక్క‌డ కాంగ్రెస్‌+జేడీఎస్ ఒక్క‌టైతే బీజేపీకి క‌ష్ట‌లు త‌ప్పేలా లేవు.