చంద్ర‌బాబు గ్రాఫ్ త‌గ్గుతోందా…

ఏపీలో అధికార టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ఒకే వ‌ర‌లో ఇమ‌డ‌ని క‌త్తుల్లా పోట్లాడుకుంటున్నాయి. పైకి ఈ రెండు పార్టీలు మిత్ర‌ప‌క్షంగా క‌నిపిస్తున్నా రెండు పార్టీల నాయ‌కులు మాత్రం మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. టీడీపీతో పొత్తు లేకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము గెలుస్తామ‌ని బీజేపీ నాయ‌కులు చెపుతున్నారు. బీజేపీకి ఎవ‌రితోను పొత్తులు అక్క‌ర్లేద‌ని..ఏపీకి బీజేపీ ముఖ్య‌మంత్రే కావాల‌ని బీజేపీలో కొంద‌రు నాయ‌కులు అధిష్టానానికి నూరి పోస్తున్నారు.

ఇక టీడీపీ నాయ‌కులు అయితే బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే టీడీపీకి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని చెపుతున్నారు. ఏదేమైనా ఈ రెండు పార్టీల మ‌ధ్య పైన ప‌టారం..లోన లొటారం అన్న చందంగా పొత్తు కొన‌సాగుతోంది. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే త‌న మెజార్టీ మ‌రింత పెరిగేద‌ని చేసిన వ్యాఖ్య‌లు తాజాగా రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్‌కు మ‌రింత‌గా కార‌ణ‌మ‌య్యాయి. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌ల‌పై వెన‌క్కి త‌గ్గాల‌ని చెప్పినా కూడా నాని మ‌రోసారి తాను త‌న మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చెప్పారు.

ఇక బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో బీజేపీ సీనియ‌ర్లు టీడీపీతో పొత్తు వ‌ద్ద‌ని ఆయ‌న‌కు చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత కావూరు సాంబ‌శివ‌రావు అయితే చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు టీడీపీలో మంట పుట్టిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందని, ప్రభుత్వం మొత్తం అవినీతిమయం అయిందని, ఇదే విషయాన్ని అమిత్‌ షాకు చెప్పామని ఆయ‌న తెలిపారు.

ఏ విష‌యంలోను మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీని టీడీపీ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆయ‌న టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్నందున ఆ వ్య‌తిరేక‌త బీజేపీపై కూడా ప‌డుతోంద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల టైం ఉన్నందున ఈ లోగా ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చ‌ని కూడా కావూరు స్ప‌ష్టం చేశారు. ఏదేమైనా బీజేపీ సీనియ‌ర్ నేత హోదాలో ఉన్న కావూరు చంద్ర‌బాబు గ్రాఫ్ త‌గ్గుతంద‌ని అన‌డంతో టీడీపీతో పొత్తు బీజేపీలో చాలా మందికి ఇష్టం లేద‌న్న‌దే అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఈ క‌ల‌హాల కాపురం ఎలా కొన‌సాగుతుందో చూడాలి.