మ‌రో మోసానికి తెర‌లేపిన బీజేపీ

ప్ర‌త్యేక‌హోదా అని త‌ర్వాత ప్యాకేజీని ప్ర‌క‌టించి న‌మ్మించి మోస‌గించిన కేంద్రం.. మ‌రోసారి ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టేందుకురెడీ అవుతోంది. కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి వెంక‌య్య రాజీనామా చేసిన తర్వాత‌.. ఆ స్థానంలో ఎవ‌రిని నియ మించాల‌నే అంశంపై గ‌ట్టిగానే చర్చ జ‌రుగుతోంది. దీనిపై అటు టీడీపీ, ఇటు బీజేపీ కూడా ప్ర‌య‌త్నాలు తీవ్ర‌త‌రం చేస్తున్నాయి. మెత్త‌గా కొట్టి.. నొప్పి త‌గ్గ‌డానికి ఆయింట్‌మెంట్ రాసిన చందంగా.. వ్య‌వ‌హ‌రించాల‌ని బీజేపీ పెద్ద‌లు వ్యూ హాలు ర‌చిస్తున్నార‌ట‌. ముఖ్యంగా విశాఖ‌కు రైల్వే జోన్ ఇస్తామ‌ని చెప్పి.. మోస‌గించిన వారిపై విశాఖ ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేపథ్యం లో ఆ ప్రాంతానికి చెందిన ఎంపీకి కేంద్రమంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని యోచిస్తున్నార‌ట‌.

విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్రాకి కేంద్రం ఇస్తాన‌న్న రెండు పెద్ద హామీలు… ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్‌! హోదా అంశం ఎప్పుడో అట‌కెక్కించేశారు. హోదాకు మించిన ప్యాకేజీ ఇచ్చేశామ‌ని కేంద్రం చేతులు దులుపుకున్నారు. ఇక, మిణుకు మిణుకుమంటూ మిగిలింది రైల్వే జోన్‌. విశాఖ‌కు రైల్వే జోన్ ఇస్తామ‌ని ఊరిస్తూ వ‌స్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రిని కూడా ఆంధ్రా కోటా నుంచే రాజ్య‌స‌భ‌కు పంపించారు. వార్షిక బ‌డ్జెట్లు వ‌చ్చి వెళ్లిపోతున్నా.. రైల్వే జోన్ పై ఇంత‌వ‌ర‌కూ కేంద్రం స్ప‌ష్టత ఇచ్చిందీ లేదు! హోదా బ‌దులుగా ప్యాకేజీ అనే ప్ర‌త్యామ్నాయాన్ని ఎలా చూపించారో… ఇప్పుడు రైల్వే జోన్ కి కూడా అలాంటిదే చూపే ప్ర‌య‌త్నంలో కేంద్రం ఉన్న‌ట్టు తెలుస్తోంది!

కేంద్ర‌మంత్రిగా ఉండ‌గా ఆయ‌న తెలుగు రాష్ట్రాల్లో భాజ‌పాకి పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రిస్తుండేవారు. దాంతో ఏపీకి ఏర్ప‌డిన లోటును భ‌ర్తీ చేసేందుకు ఒక కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో భాజ‌పా ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఎవ‌రికి అప్ప‌గించాల‌ని అమిత్ షా మేధోమ‌థ‌నం చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఎంపీ కంభంపాటి హ‌రిబాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌! ప్ర‌స్తుతం రాష్ట్రంలో భాజ‌పా బాధ్య‌త‌లు చూస్తున్నారు. ఆయ‌న‌కి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఇస్తే.. వెంక‌య్య స్థానాన్ని భ‌ర్తీ చేయొచ్చ్చ‌ని భావిస్తున్నారు. ఆయ‌న‌కే మంత్రి ప‌ద‌వి ఎందుక‌నేదానికి కేంద్రం ద‌గ్గ‌ర మ‌రో వాద‌న ఉంద‌ని స‌మాచారం.

విశాఖ‌కు రైల్వే జోన్ ఇప్ప‌ట్లో ఇచ్చే ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి, అదే ప్రాంతానికి చెందిన ఎంపీకి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా ఆ అసంతృప్తి కొంతమేర త‌గ్గించ‌వచ్చ‌నేది అమిత్ షా ఆలోచ‌నట‌. రైల్వే జోన్ ఇవ్వ‌లేదు కాబ‌ట్టి, విశాఖ ప్రాంతానికి చెందిన ఎంపీకి కేంద్ర క్యాబినెట్ లో చోటు క‌ల్పిస్తే స‌రిపోతుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌. రైల్వే జోన్ కి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ప్ర‌త్యామ్నాయ ఏర్పాటు ఎలా అవుతుంద‌నేది వారికే తెలియాలి. ప్ర‌త్యామ్నాయ ఏర్పాటు పేరుతో రైల్వే జోన్ అంశాన్ని నిమ‌జ్జ‌నం చేసేందుకు భాజపా ప్ర‌య‌త్నిస్తోంద‌నే అర్థం చేసుకోవాలి! మొత్తానికి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి కోసం రైల్వే జోన్‌ను తాక‌ట్టుపెట్ట‌స్తార‌నేది మాత్రం ఇప్పుడు స్ప‌ష్ట‌మ‌వుతోంది.