బీజేపీకి ప్ల‌స్‌.. కేసీఆర్‌కు మైన‌స్‌

ప్ర‌త్య‌ర్థుల‌ను త‌న వ్యూహాల‌తో చిత్తు చేయ‌గ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్‌.. తాను తీసుకున్న గోతులో తానే ప‌డబోతున్నారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌ను ఇరుకున పెట్ట‌బోయి.. తానే ఇరుక్క‌బోతున్నారా అని విశ్లేష‌కులు సందేహ‌ప‌డుతున్నారు. మైనారిటీల‌కు రిజ‌ర్వేష‌న్ అంశం.. కేసీఆర్‌కు లాభం చేకూర్చ‌బోయి.. న‌ష్టం క‌లిగిస్తుందా అనే ఆందోళ‌న మొదలైంది. బీజేపీని ఇబ్బంది పెట్టి రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని తీసుకున్న నిర్ణ‌యం బూమ‌రాంగ్ అయ్యే అవ‌కాశాలున్నాయనే అనుమానాలు అందరిలోనూ రేకెత్తుతున్నాయి.

2014లోగానీ,మొన్న‌టి యూపీ ఎన్నిక‌ల్లో గానీ బీజేపీ అధికారంలోకి రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. అధికార పార్టీలోని లుక‌లుక‌లు, నాయ‌క‌త్వ లోపం! వీటితోనే బీజేపీ భారీ మెజారిటీ సాధించింది. ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న నాయకులు చేస్తున్న మైనారిటీ రాజకీయాలే బీజేపీని అధికారంలోకి వచ్చేలా చేస్తున్నాయి. యూపీ ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీ ఫోక‌స్ అంతా.. తెలంగాణ‌పై పెట్టింద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు మైనారిటీ రిజ‌ర్వేష‌న్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి రాజ‌కీయంగా ప్ర‌యోజనం పొందాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.

మైనారిటీలకు ఏదో చేస్తున్నామన్న భ్రమలు కల్పించడం కోసం బోలెడన్ని పబ్లిసిటీ స్టంట్స్ మాత్రం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కెసీఆర్ కూడా అదే చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేసీఆర్ చేస్తున్న మైనారిటీ రిజర్వేషన్స్ పబ్లిసిటీ స్టంట్ బీజేపీకి మేలు చేసేలా కనిపిస్తోంది. అసెంబ్లీ స్థాయిలో హడావిడి చేసి ఫైనల్‌గా బిజెపిని దోషిగా నిలబెట్టాలన్నట్టుగా కెసీఆర్ వ్యూహరచన చేస్తున్నా అది బూమరాంగ్ అయి కెసీఆర్‌నే దెబ్బకొట్టే సూచనలు కనిపిస్తున్నాయ‌ని వివ‌రిస్తున్నారు. మైనారిటీల మెప్పు కోసం కేసీఆర్ పడుతున్న తాపత్రయాన్ని బీజేపీ నేతలు బాగా హైలైట్ చేస్తున్నారు.

వీలైనంత వరకూ ఆ స‌మ‌స్య‌ను టచ్ చేయకుండా ఉంటేనే బాగుంటుందేమో అని భావిస్తున్నారు. కులాల ఓట్ల కోసం, మతాల ఓట్ల కోసం ఇంకా రిజర్వేషన్స్ పెంచుకుంటూ పోతామంటే మాత్రం మొదటికే మోసం జరగొచ్చ‌ని హెచ్చ‌రిస్తున్నారు. కేసీఆర్ వ్యూహాలను ఎదుర్కునే స్థాయి నేత తెలంగాణాలో లేకపోవడమే కేసీఆర్ ప్రధాన బలం. కానీ అమిత్ షా- మోదీ ద్వ‌యం పూర్తిగా రంగంలోకి దిగితే.. ఏ చిన్న త‌ప్ప చేసినా అది వారి బ‌లాన్ని రెట్టింపు చేస్తుంద‌ని సూచిస్తున్నారు.