తెలంగాణ‌లో క‌మ‌ల నాథుల క‌ల‌లు నెర‌వేరేనా?!

ఉత్త‌రాదిలో త‌మ ప‌ట్టును నిలుపుకొన్న బీజేపీ.. ఇప్పుడు 2019లో జ‌ర‌గ‌బోయే ఏపీ, తెలంగాణ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింది. ద‌క్షిణాదిలో ఒక్క కర్ణాట‌క‌లో త‌ప్ప మిగిలిన రాష్ట్రాల్లో అంతంత మాత్రంగా ఉండ‌డంతో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై దృష్టిపెట్టిన బీజేపీ సార‌ధి అమిత్ షా, ప్ర‌ధాని మోడీలు.. అటు తెలంగాణ‌, ఇటు ఏపీల‌లో నూ తాము సొంతంగా ఎద‌గాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణలో తొలి మూడు రోజులు ప‌ర్య‌టించిన అమిత్ షా త‌న ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసుకునేందుకు అన్ని విధాలా ప్ర‌య‌త్నించారు.

తాము నిధులు ఇస్తున్నా.. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఖ‌ర్చుచేయ‌డం లేద‌ని, కేంద్ర ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంలో తీవ్ర నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో రాబోయే రోజుల్లో బీజేపీకి అధికారం ఇవ్వ‌డం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. ఇంతవ‌ర‌కు షా.. షో ర‌క్తి క‌ట్టించినా.. అస‌లు స‌మ‌స్య ఎన్న‌క‌లే! అక్క‌డ షో స‌క్సెస్ అవ్వాలంటే మాత్రం ముందు ఇంటిని చ‌క్క‌దిద్దుకోవాల్సిందే. బీజేపీ తెలంగాణ‌లో ఎద‌గాలంటే.. ముందు స్థానిక బ‌లాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అదేస‌మ‌యంలో గ్రూపు రాజ‌కీయాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది కూడా.

దీనికితోడు ముస్లింల‌ను ఆక‌ర్షించ‌డం అంటే అంత వీజీకాదు. పోనీ ముస్లిం వ్య‌తిరేక ఓటును త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుందామన్నా కూడా అదీ అంత వీజీకాదు. ప్ర‌స్తుతం కేసీఆర్ అంటే దేవుడు లెక్క చూస్తున్న తెలంగాణ ప్ర‌జ‌ల్లో బీజేపీ గూడు క‌ట్టుకోవ‌డం అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాద‌నేది నేత‌లెరిగిన స‌త్యం. దీనిక‌న్నా ముందు నాగం జ‌నార్ద‌న‌రెడ్డి.. మాజీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డిల వ్య‌వ‌హారం పార్టీకి చేటు చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యం లో వీరిద్ద‌రి మ‌ధ్య సఖ్య‌త పెంచి, త‌ద్వారా పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి పెడితే మంచిద‌నే కామెంట్లు కురుస్తున్నాయి.

అప్పుటికి 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తాయ‌ని దీంతో.. కేడ‌ర్ బ‌ల‌ప‌డుతుంద‌నే వాద‌న వ‌స్తోంది. ఇక‌, అదేస‌మ‌యంలో ఆయా పార్టీల్లోని అసంతృప్తులు కూడా బీజేపీకి క్యూ క‌ట్టే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి వీట‌న్నినీ భేరీజు వేసుకోకుండానే షా .. ఇలా ప‌ర్య‌ట‌న చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలూ ఉండవ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌!! మ‌రి షా.. మైండ్‌లో ఏముందో ?!! ఇప్ప‌టిక‌ప్పుడు అయితే మాత్రం కేసీఆర్ వంటి బ‌ల‌మైన మాస్ లీడ‌ర్ ఉన్న తెలంగాణ‌లో బీజేపీ ఎదగ‌డం, అధికారం చేప‌ట్ట‌డం అనేది.. ఉట్టికెగ‌ర లేన‌మ్మ‌.. సామెత‌నే గుర్తుకు తెస్తోంది!