ప‌ళ‌నిపై క‌క్ష సాధింపుల‌కు కేంద్రం స్కెచ్ రెడీ

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత‌ త‌మిళ‌నాడులో ప‌ట్టు సాధించాల‌ని… మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వాన్ని ముందుంచి తాము వెనక నుంచి చ‌క్రం తిప్పాల‌ని భావించిన కేంద్రం ఆశ‌ల‌కు ప‌ళ‌నిస్వామి రూపంలో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌నిస్వామి విజ‌యం సాధించ‌డంతో సైలెంట్ అయిపోయింది. అయితే `ఇంత‌టితో అయిపోలేదు, నిన్ను వ‌దిలిపెట్టేది లేదు` అంటోంది కేంద్రం. ఎంతో కాలం ఆ స్థానంలో కూర్చోలేవు అంటూ పరోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీచేస్తోంది. ఆయ‌న గ‌త చ‌రిత్ర‌ను త‌వ్వి.. లొసుగుల‌ను బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తోంది. వాటి ద్వారా ప‌ళ‌నిస్వామిని త‌మ చెప్పు చేతల్లో పెట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింద‌ట‌.

త‌మిళ‌నాట రాజకీయాల్లో మ‌ళ్లీ సంక్షోభం సృష్టించాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోందా? న‌యానోభ‌యానో అక్క‌డ ప‌రిస్థితుల‌ను, నేత‌లను త‌మ చెప్పుచేతల్లో పెట్టుకోవాల‌ని చూస్తోందా? క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌బోతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. `దివంగత జయలలిత కూర్చొన్న కుర్చీలో కూర్చొన్నావు.. ఇకపై ఆ పదవిలో ఎక్కువ రోజులు ఉండలేవు` ఇవి పన్నీర్ సెల్వ‌మో, డీఎంకే అధినేత స్టాలినో చేసిన వ్యాఖ్య‌లు కాదు. సాక్ష్యాత్తూ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్య‌లు!! ప్రస్తుతం ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేకేత్తిస్తున్నాయి

ఢిల్లీ పెద్ద‌లు ప‌ళ‌నిస్వామిపై క‌న్నేసిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌ళ‌నిపై గ‌తంలో ఏమైనా కేసులున్నాయా అని ఆరా తీశార‌ట‌. అంతేకాదు పెద్ద నోట్ల కేసులో ప‌ట్టుబ‌డిన శేఖ‌ర్ రెడ్డితో … ప‌ళ‌నిస్వామి వియ్యంకుడికి స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ట‌. ఇప్ప‌టికే ప‌ళ‌నిస్వామి వియ్యంకుడిపై అధికారుల క‌న్ను ఉంది. శేఖ‌ర్ రెడ్డితో సంబంధాల‌పై ఆరా తీస్తున్నారు. ఈలింకులు ప‌ళ‌నిస్వామి దాకా రావొచ్చ‌న్న అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో ఆ కేసు ఈయ‌న మెడ‌కు ఎక్క‌డ చిక్కుకుంటుందోన‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్పుడే కాకుండా కొంత‌కాలంలో అంతా ప్ర‌శాంతంగా ఉన్న స‌మ‌యంలో మ‌ళ్లీ ఈ కేసును తిర‌గదోడే అవకాశం ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అదే జ‌రిగితే ప‌ళ‌నిస్వామికి క‌ష్టాలు త‌ప్ప‌వు మ‌రి. ఢిల్లీ పెద్ద‌ల ఆలోచ‌నను ముందే ప‌సిగ‌ట్టిన ప‌ళ‌నిస్వామి.. ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ట‌. అందుకే ఆయ‌న వ‌ర్గం వ్యూహాత్మ‌కంగా అడుగులేస్తోంద‌ని స‌మాచారం. దారికి వ‌స్తే స‌రేస‌రి.. లేక‌పోతే ఇక నిరంకుశ‌త్వంగా ఏదో ఒక విధంగా క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డే ప్ర‌ధాని మోడీ.. త‌లుచుకుంటే ఏదైనా సాధ్య‌మే క‌దా!!